చేరినాడు చూడరో… లక్ష్మీ నరసింహుడు
అత్తారింటి నుంచి కోనకు పెంచలస్వామి
గిరిజనవాడలో అంబరాన్నంటిన సంబరాలు
నవ వధూవరులకు గిరిజనుల సారె
ఉత్సవాల అనంతరం తిరిగి అత్తారింటికి..
సిరా న్యూస్,బద్వేలు;
గోనుపల్లి, గోనుపల్లి గిరిజన వాడలు గోవింద, పెంచల నామస్మరణలతో మారుమోగాయి. తప్పెట్లు,తాళాలు, బాజాభజంత్రీల నడుమ ఉభయ దేవేరులతో కలిసి పెంచల నృసింహుడు బ్రహ్మోత్సవాలు చేసుకునేందుకు అత్తారింటి నుంచి కోనకు పయనమయ్యారు.తొలుత గోనుపల్లి గ్రామంలోని పెంచల ఆలయం నుంచి పల్లకిలో చెంచులక్ష్మి అమ్మవారి ఇంటికి (గిరిజనవాడ)కు చేరుకున్నారు. కొత్త అల్లుడి రాకతో గిరిజనవాడలో సంబరాలు అంబరాన్నంటాయి. ఇంటికి వచ్చిన అల్లుడికి గిరిజనులు తమ ఆచారం ప్రకారం పుట్టతేనె, ఇంజేటి గడ్డలు, నారె మొలతాడును సారెగా ఇచ్చారు.వాడలోని ప్రతి ఇంటి వద్ద ప్రత్యేక పందిళ్లు, ముగ్గులు వేసి వధూవరులకు ఘన స్వాగతం పలికారు. అత్తారింటికి చేరుకున్న నవవరుడిని (శ్రీవారిని) చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు గిరిజనవాడకు చేరుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ముత్తై దువులు వదూవరులను గ్రామ పొలిమేర వరకు సాగనంపారు. ప్రత్యేకంగా ఆలంకరించిన పల్లకిలో దేవేరులతో కలిసి కొలువుదీరిన స్వామివారు గ్రామ శివారులోని గొల్లబోయి ఆలయానికి చేరుకుని తొలిదర్శనం గొల్లబోయికి ఇచ్చారు. ఆనంతరం బోయలు పల్లకి మోసుకుంటూ ఆరు కి.మీ కాలినడకన కోనకు వేయ నమయ్యారు. సహజ సిద్ధమైన చల్లని వాతావరణంలో కొద్ది దూరం, ట్యాంకర్లతో పట్టిన నీటితో చల్లబడ్డ రోడ్డుపై మిగిలిన దూరం వందలాది మంది భక్తులతో శ్రీవారు కోనకు చేరారు. ఆలయ ఈవో విజయ సాగర్ బాబు, ప్రధాన అర్చకులు రామయ్యస్వామి, పెంచలయ్యస్వామి,అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. ఇక్కడ ఆరు రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించుకుని తిరిగి స్వామివారు గోనుపల్లికి చేరుకుంటారు.ఈ సందర్భంగా వారంపాటు గోను పల్లివాసులు నియమనిష్టలతో మాంసాహారాలకు దూరంగా ఉంటారు. కాగా పెంచలకోనలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక స్నపన తిరుమంజనం, విశేష పూజలు నిర్వహించారు.
========================xxx