సిరా న్యూస్;
తాయిలాల ప్రచారం పోయింది… ఉచితాల వర్షం ఆగింది. మద్యం పంచినా… డబ్బులు ఇచ్చినా.. ఓట్ల పడతాయో లేదో అన్న ఆందోళన. ఇక ఇప్పుడు ఎన్నికల్లో గెలవాలంటే… ఓటర్లను భయపెట్టడం అనేది ఓ విన్నింగ్ ఫార్ములాగా మారింది. ఓటర్ల భావోద్వేగాలు రెచ్చగొట్టడం… భయపెట్టడమే పోల్ మేనేజ్మెంట్ లో ఎక్కువ వర్క్ అవుట్ అయ్యే ధియరీగా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఇదే ధోరణిలో జాతీయ పార్టీల నుండి.. ప్రాంతీయ పార్టీల వరకు ఇదే అంశాన్ని తమ ఎన్నికల వ్యూహాంగా అమలు చేస్తున్నాయి. తమ పార్టీ మ్యానిఫెస్టో చెప్పో… ఉచిత పథకాల పేరు చెప్పో… తమ పార్టీ ఘన చరిత్ర లేదా తమ హయాంలో సాగించిన పాలన అంశాలను చెప్పడం అనేది ఇప్పుడు పాత ట్రెండ్. ఆ పార్టీకి ఓటేస్తే జరిగే పరిణామాలను 70 MM స్క్రీన్‌లో డాల్బీ సౌండ్ ఎఫెక్ట్ లో చూపించి… భయపెట్టే ధ్రిల్లర్ మూవీగా ఓటర్ ముందు నాయకులను తమ ప్రసంగాలను ప్రజెంట్ చేస్తున్నారు. దీంతో ఓటర్ తాము చూపించే ధ్రిల్లర్ సినిమాకు తన ఫ్యూచర్ ముందే కళ్ల ముందు కనపడి ప్రత్యర్థి పార్టీ కి ఓట్లు వేయకుండా ఉంటారన్నది కొత్త పొలిటికల్ ధియరీగా మారింది. ఇదే ప్రధానంగా జాతీయ పార్టీల నుండి ప్రాంతీయ పార్టీల వరకు తమ ఎన్నికల ప్రచారం సాగిస్తున్నాయి. .ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లోను ప్రధాన పార్టీలుగా ఉన్న టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన సైతం ఇదే భయం అనే మంత్రం జపించాయి. తొలుత తాము అమలు చేసిన ప్రభుత్వ పథకాలు కాపాడతాయని భావించిన వైకాపా.. ఆ తర్వాత తమ ప్రభుత్వం లేకపోతే ప్రస్తుతం కొనసాగిస్తున్న సంక్షేమ పథకాలు ఆగుతాయని ఓటర్లను భయపెట్టే ప్రయత్నం చేసింది. తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు 40 వేల కోట్లు ఖర్చు చేస్తోంది.. టీడీపీ ఇచ్చిన హమీలు అమలు చేయాలంటే.. లక్షా 40 వేల కోట్లు ఖర్చవుతుంది. ఇంత మొత్తం నిధులు టీడీపీ సమీకరించలేని పరిస్థితి ఉంటుంది.. కాబట్టి టీడీపీకి ఓటు వేస్తే ఆ హమీలు అమలు చేయని పరిస్థితి ఉంటుందని చెప్పడంతో పాటు టీడీపీ అధికారంలోకి వస్తే ఇప్పుడు అమల్లో ఉన్న పథకాలు రద్దు అవుతాయని వైకాపా శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేశాయి. వీరికి దీటుగా టీడీపీ సైతం ఇదే మంత్రాన్ని ప్రయోగించింది. జగన్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను వైకాపా ప్రభుత్వం అమలు చేస్తుంది. ఆ యాక్టు ప్రకారం మీ భూములు, పంట పొలాలు , స్వంత ఇళ్లు గుంజుకోవడం ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. జన సేన సైతం ల్యాండ్ యాక్ట్ పైన ఇదే రీతిలో జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చెపట్టింది. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున రాష్ట్రంలో హింస జరుగుతుందని భయపెట్టే ప్రయత్నం జనసేన చేసింది. బీజేపీతో జట్టు కట్టిన టీడీపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తొలిగిపోతాయని, క్రైస్తవులకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని వైకాపా శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేపట్టాయి.తెలంగాణలో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోను ప్రధాన పార్టీలయిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు సైతం ఇదే తంత్రాన్ని నమ్ముకున్నాయి. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే, బీజేపీకి ఓటు వేసినట్లేనని సీఎం రేవంత్ రెడ్డి తన ప్రచారంలో పేర్కొనడం గమనార్హం. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు పోతాయని, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మళ్లీ కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరికీ లాభం ఉండదని కాంగ్రెస్ ఓటర్లను భయపెట్టే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ కు ఓటేస్తే ఇచ్చిన హమీలు నెరవేర్చదని, ఇప్పటికే రైతు రుణ మాఫీ జరగదని, రైతులను సాగు నీరు ఇవ్వదని, 24 గంటల విద్యుత్ ఇవ్వదని నెగిటీవ్ ప్రచారానికి గులాబీ పార్టీ దిగింది. ఇక కమలం పార్టీ సైతం కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేయలేదని, ఆ పార్టీకి ఓటు వేయవద్దని ప్రచారం చేస్తూనే…. బీజేపీ కేంద్ర నాయకుల ప్రచారాన్నే ఇక్కడ చెప్పే ప్రయత్నాన్ని రాష్ట్ర కమలనాధులు చేశారు.ప్రాంతీయ పార్టీల తీరు ఇలా ఉంటే… జాతీయ పార్టీలయిన బీజేపీ, కాంగ్రెస్ లు వారికి పెద్దన్నలా బ్లాక్ మెయిల్ మంత్రను అమలు చేశాయి. బీజేపీ ఇందులో ముందుందనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే అయోధ్యలో నిర్మించిన రామాలయాన్ని తిరిగి కూలగొడతారని తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు ఖర్గే సహా, అగ్ర నేత రాహూల్ గాంధీ సైతం రామ మందిరాన్ని పూర్తి చేస్తామని ప్రకటించాల్సి వచ్చింది. అంతే కాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 370 ఆర్టికల్ ను రద్ద చేసి తిరిగి కాశ్మీర్ పై నియంత్రణ కోల్పోయేలా చేస్తుందని బీజేపీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అంతే కాకుండా రాహుల్ గాంధీని పొగుడుతూ పాకిస్థాన్ కు చెందిన ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలను పదే పదే ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ శత్రు దేశానికి మిత్రుడైన పార్టీగా అభివర్ణించే ప్రయత్నం కమలనేతలు చేస్తునే ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉగ్రవాదులు చెలరేగిపోతారని, ఎప్పుడు ఎక్కడ బాంబులు పేలతాయో తెలియని పరిస్థితి ఏర్పడుతుందని భయపెట్టే రీతిలో బీజేపీ పార్టీ ఎన్నికల ప్రచారం సాగుతోంది. అంతే కాకుండా ఓ వర్గానికి కొమ్ము కాస్తూ.. దేశంలోని మెజార్టీ వర్గానికి ప్రమాదం కొని తెచ్చే పార్టీ హస్తం పార్టీ అని కమలం పార్టీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, నడ్డా, యోగి, రాజనాథ్ సింగ్ వంటి నేతలు ప్రచారం చేయడం గమనార్హం.బీజేపీకి చేస్తోన్న ప్రచారానికి ఏం తక్కువ కాకుండా కాంగ్రెస్ నేతలు ఖర్గే, రాహుల్, ప్రియంక సహా ఇతర నేతలంతా బీజేపీ దేశానికి ప్రమాదకరమైన పార్టీగా అభివర్ణిస్తూ ఇదే ఫార్ములాను ఫాలో అవడం విశేషం. బీజేపీ 400 సీట్ల మెజార్టీతో అధికారంలోకి వస్తే అన్ని రాజకీయ పార్టీల నేతలు అక్రమ కేసులతో జైళ్లో ఉంటారని, అన్ని పార్టీలు కనుమరుగవడం ఖాయమని.. ఇది ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదమని హస్తం నేతలు ప్రచారం చేస్తున్నారు. అంతే కాకుండా రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చి వేస్తారని, రాజ్యాంగం నుండి సెక్యులర్ అనే పదాన్ని తొలగించి దేశాన్ని మత దేశంగా మార్చుతారని కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఈ ఎన్నికల్లో తమ పార్టీ మ్యానిఫెస్టోనో, తమ పథకాలనో..తమ పార్టీ హయాంలో జరిగిన పాలన తీరునో చూసి ఓటు వేయాలని కోరే రోజులు పోయాయి. ప్రత్యర్థి పార్టీకి ఓటు వేస్తే జరిగే విష పరిణామాలు ఇవే అని చెప్పి భయపెట్టి ఓట్లు గుంజుకునే ఎన్నికల స్ట్రాటజీని ఇప్పుడున్న పొలిటికల్ పార్టీలు ఫాలో అవడం విశేషంగా చెప్పుకోవాలి . అయితే రానున్న రోజుల్లో ఈ ఎన్నికల ప్రచారం తీరు ఎలాంటి రూపుదాల్చుతుందో అని ప్రజాస్వామిక వాదులు కూడా ఓటర్ లాగే భయపడటం మరో విశేషం. అయితే ఈ బ్లాక్ మెయిల్ ఎలక్షన్ స్ట్రాటజీని బాగా వంటబట్టించకున్న పార్టీ ఏదో తెలియాలంటే జూన్ 4వ తేదీ న వెలువడే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.
==================