మరో విడత స్పెక్ట్రమ్‌ వేలం.. ఫిబ్రవరిలో ముహూర్తం

సిరా న్యూస్,న్యూఢిల్లీ ;

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందే తదుపరి స్పెక్ట్రమ్‌ వేలం పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ వేలం ఉంటుందని టెలికాం శాఖ (డాట్‌) వర్గాల సమాచారం. 2021 సెప్టెంబరు నాటి నిర్ణయం ప్రకారం ప్రభుత్వం ఏటా స్పెక్ట్రమ్‌ వేలం నిర్వహించాలి. అయితే వివిధ కారణాలతో గత ఏడాది ఆగస్టు తర్వాత ప్రభుత్వం స్పెక్ట్రమ్‌ వేలం నిర్వహించలేదు. వచ్చే ఫిబ్రవరిలో ఈ వేలం నిర్వహించడం ద్వారా ఎన్నికలకు ముందే ఖజానాకు కొంత నిధులు సమకూర్చుకోవాలని యోచిస్తున్నట్టు సమాచారం.
అదే ధర: ఈసారి కూడా తక్కువ బ్యాండ్‌విడ్త్‌ ఉండే 600-2300 మెగాహెట్జ్‌, మిడ్‌ (3300 ఎంహెచ్‌జడ్‌), 26 గిగాహెర్జ్‌ (జీహెచ్‌జడ్‌) స్పెక్ట్రమ్‌నే ప్రభుత్వం వేలానికి పెడుతోంది. కంపెనీలను ఆకర్షించేందుకు వీలుగా బ్యాండ్‌ల స్పెక్ట్రమ్‌కు 2022లో నిర్ణయించిన ధరనే ట్రాయ్‌ ఖరారు చేసింది. అయితే 37 జీహెచ్‌జడ్‌ స్పెక్ట్రమ్‌ ధరను ట్రాయ్‌ ఇంకా నిర్ణయించాల్సి ఉంది.
కంపెనీల అనాసక్తి: రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌ కంపెనీలు గత ఏడాది నిర్వహించిన వేలంలో 5జీ సేవలకు అవసరమైన 1800 ఎంహెచ్‌జడ్‌, 2100 ఎంహెచ్‌జడ్‌ స్పెక్ట్రమ్‌ను పెద్దఎత్తున కొనుగోలు చేశాయి. దీంతో ఈ రెండు కంపెనీలు ఈసారి పెద్దగా స్పెక్ట్రమ్‌ వేలంలో పాల్గొనక పోవచ్చని అంచనా. ఎయిర్‌టెల్‌ ఎండీ, సీఈఓ గోపాల్‌ విఠల్‌ ఇప్పటికే ఈ విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించారు. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న వొడాఫోన్‌ ఐడియా ఈసారి కూడా స్పెక్ట్రమ్‌ వేలానికి దూరంగానే ఉంటుందని భావిస్తున్నారు. ప్రభుత్వ రంగంలోని బీఎ్‌సఎన్‌ఎల్‌కు ప్రభుత్వం 5జీ స్పెక్ట్రమ్‌ను నామినేషన్‌ పద్దతిలో కేటాయించనుంది. కాబట్టి ఈ సంస్థ కూడా ఫిబ్రవరిలో జరిగే స్పెక్ట్రమ్‌ వేలంలో పాల్గొనే అవకాశం లేదు.
తగ్గనున్న ఆదాయం: కంపెనీల నుంచి పెద్దవగా ఆసక్తి లేకపోవడంతో ఈసారి జరిగే స్పెక్ట్రమ్‌ వేలం నుంచి ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం సమకూరే అవకాశం కనిపించడం లేదు. గత వేలంలో కంపెనీలు అంతంత మాత్రంగానే పాల్గొన్నా స్పెక్ట్రమ్‌ వేలం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.1,50,173 కోట్లు సమకూరాయి. 2021లో నిర్వహించిన 4జీ స్పెక్ట్రమ్‌ వేలంతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. కంపెనీల నుంచి పెద్దగా ఆసక్తి లేకపోవడంతో ఈసారి 2022లో సమకూరిన మొత్తం కూడా సమకూరక పోవచ్చని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *