ప్రశ్నార్ధకంగా ఆలయాల భద్రత

సిరా న్యూస్,కరీంనగర్;
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లోని ఆలయాల భద్రత ప్రశ్నార్థకంగా మారుతుంది. భక్తుల్లో అభద్రత భావం ఏర్పడుతుంది. అరకొర భద్రత సిబ్బంది ఉన్నప్పటికి మొక్కుబడి డ్యూటీలు చేస్తు ప్రైవేట్ వ్యక్తులచే భద్రతను పర్యవేక్షించాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. తద్వారా ఆలయాల భద్రత గాలిలో దీపంలా మారుతుంది.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరంలో ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న క్షేత్రం, కొండగట్టుకు ఎస్పీఎఫ్ భద్రత తూతూ మంత్రంగానే ఉండడం గమనార్హం. వేములవాడకు నిత్యం భక్తుల రద్దీ ఉంటుంది.సాధారణ రోజుల్లో 10 వేలమంది, ఆది, సోమవారాల్లో 25వేలు, ఉత్సవాల సమయం లో సుమారు రెండు లక్షల మంది స్వామివారిని దర్శించుకుంటారు. భక్తుల రద్దీతో ఉండే వేములవాడ రాజన్న ఆలయంలో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. రాజన్న దర్శనానికి వచ్చే భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేయడానికి లక్షలాది రూపాయలు వెచ్చించి మెటల్ డిటెక్టర్లు, హ్యాండ్ డిటెక్టర్లు కొనుగోలు చేశారు.భద్రత కోసం 12 మంది ఎస్ పి ఎఫ్ సిబ్బంది, 36 మంది హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ప్రోటోకాల్ పేరుతో ఐదుగురిని వాడుకుంటున్నారు. అంతే కాకుండా దేవాలయంలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులను సైతం వదలడం లేదు. ఇవన్నీ అలా ఉండగా డ్యూటీ లో వినియోగించాల్సిన ఆయుధాలను సైతం ప్రైవేటు కాంట్రాక్టర్ల దగ్గర పనిచేసే అనామకులకు ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. రాజన్న ఆలయానికి వచ్చే భక్తులను పరిశీలించడానికి సెల్ ఫోన్ కాంట్రాక్టు సిబ్బందికి హ్యాండ్ డిటెక్టర్ ఇచ్చి చెక్ చేయించడం వివాదస్పదంగా మారింది.కొండగట్టుకు సాధారణ రోజుల్లో వేలల్లో, హనుమాన్ జయంతి సమయాల్లో లక్ష లాదిగా తరలివస్తారు. ధర్మపురి, కాళేశ్వరం ఆలయాలకు నిత్యం భక్తుల రద్దీ ఉంటుంది. పుష్కరాల సమయంలో తెలంగాణతోపాటు మహారాష్ట్ర, చత్తీస్గఢ్, కర్ణాటక నుంచి భక్తులు పోటెత్తుతారు. భక్తుల రద్దీ నేపథ్యం లో పోలీసులే భద్రత చర్యలు చేపడుతున్నారుకొండగట్టులో 15మంది వరకు హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారు. గతేడాది ఆలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. స్వామివారి అలంకరణ వస్తువులు కాజేసి పారిపోయారు. ఆ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపినా.. ఆలయానికి ఎస్పీఎఫ్ భద్రత ఇవ్వాలన్న ఆలోచన ప్రభుత్వానికి కలగకపో వడం విశేషం. ఇక్కడ కూడా ఒక ఎస్సై, 10 మంది వరకు కానిస్టేబుళ్లను నియమించాలని భక్తులు కోరుతున్నారు. ఎస్పీఎఫ్ బలగాలు ఉంటే పుణ్యక్షే త్రాల్లో దళారుల అవినీతికి ముకుతాడు పడుతుందని, ఎలాంటి వ్యాపారాల్లోనైనా పారదర్శకత పెరుగుతుందని, ఫలితంగా ఆలయాలకు ఆదాయం, భక్తులకు సౌకర్యాలు రెట్టింపు అవుతాయని స్థానిక వ్యాపారులు, భక్తులు అభిప్రాయపడుతున్నారు.18వ శతాబ్దంలో దక్షిణ భారతంలో కేవలం రెండు ఆలయాలు రోజుకు రూ.4లక్షల ఆదాయం కలిగి ఉండేవి. అందులో ఒకటి తిరుమల, రెండోది వేములవాడ. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. స్వాతంత్య్రానికి ముందే ఈ స్థాయిలో ఆదాయం ఉన్న అరుదైన దేవాలయం మన రాజరాజేశ్వర స్వామి ఆలయం. క్రమంగా గుడి ఆదాయం తగ్గిపోయింది.కొందరు పాలకులు ఈ ఆలయానికి వస్తే పదవిపోతుందని తప్పుడు ప్రచారం చేయడం కూడా ఆలయ అభివృద్ధి జరగక పోవడానికి ప్రధాన కారణంగా నిలిచింది. గత ప్రభుత్వం వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ)ను ఏర్పాటు చేసి రూ.70 కోట్లు కేటాయించింది. అందులో రూ.20 కోట్లు వెనక్కి వెళ్లాయి.ప్రస్తుత ఎమ్మెల్యే చొరవతో అందులో రూ.20 కోట్లు తిరిగి తీసుకురాగలిగారు. కొండగ ట్టుకు రూ.500 కోట్లతో మాస్టర్న్ ప్రతిపాదన ప్రకటనకే పరిమితమైంది. 2015లో ధర్మపురి, కాళేశ్వర ఆలయాలకు పుష్కరాల సమయాల్లో అసాధారణ తాకిడి కనిపించింది. ఈసారి అంతకుమించి భక్తులు వస్తారని అంచనా. ధర్మపురి, కాళేశ్వరాలకు కూడా ఎస్పీఎఫ్ భద్రత కల్పిస్తే.. పుష్కరాల సమయంలో స్థానిక పోలీసులతో సమన్వయం, భద్రతా ఏర్పాట్ల విషయంలో మరింత పకడ్బందీగా వ్యవహరించవచ్చని ఉమ్మడి జిల్లా ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
========================XX

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *