సిరా న్యూస్, హుజురాబాద్:
కాంగ్రెస్ ప్రభుత్వం విద్య వ్యవస్థను సరిదిద్దాలి: ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి
* విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
గాడి తప్పిన విద్య వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్దాలని, విద్యార్థులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి అన్నారు. గురువారం హుజురాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మణికంఠ రెడ్డి మాట్లాడారు. గత బీఆర్ఎస్ పాలన వల్ల విద్యారంగం పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని అన్నారు. విద్యారంగం పై కేసీఆర్ సమీక్ష చేయకుండా రాష్ట్రంలో విద్యను పూర్తిగా ప్రైవేట్ పరం చేశాడని , గత పది ఏళ్లలో గాడి తప్పిన విద్యారంగాన్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేయాలని అన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడి అరికట్టే విధంగా ఫ్రీజర్ నియంతను చట్టాన్ని కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ర్టంలో గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్ లో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని అన్నారు.. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల కాక విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం కళాశాలలకు ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు సంక్షేమ హాస్టళ్లు, యూనివర్సిటీలలో మౌలిక వసతులు కల్పించి ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ చేసి ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యా ప్రమాణాలు పెరిగేల కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విద్యార్థులకు,యువకులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని పేర్కొన్నారు. విద్యార్థులకు ఇస్తామన్న ఎలక్ట్రిక్ స్కూటిలు, ల్యాప్ టాప్స్, మండలానికో ఇంటర్నేషనల్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి కృషి చేయాలని అన్నారు. విద్యార్థులకు ప్రభుత్వ విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ప్రైవేట్ విద్యాసంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడిని అరికట్టాలని అన్నారు. ప్రభుత్వం విద్యాశాఖ ఫీజులు నియంత్రణకి కఠిన చట్టాలు అమలు చేయాలన్నారు. నిబంధనలు పాటించని విద్యాసంస్థలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామరాపు వెంకటేష్, జిల్లా సహాయ కార్యదర్శి కేశబోయిన రాము యాదవ్, మండల అధ్యక్షుడు వేణుగోపాల్, నాయకులు రోహిత్, కృష్ణ, వంశీ, రవి తదితరులు పాల్గొన్నారు.