సిరా న్యూస్, ఆదిలాబాద్
ప్రభుత్వాన్ని బాద్నాం చేయడానికే విత్తన రాజకీయం: కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి
జిల్లాలో సీడ్స్ కొరత లేకుండా చూడాలని కలెక్టర్‌కు వినతి
* జిల్లా కేంద్రంలో పలు విత్తన దుకాణాల సందర్శన
* అన్నిరకాలు విత్తనాలు వేసుకుంటేనే అధిక దిగుబడులు
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బాద్నాం చేయడానికే ప్రతిపక్షాలు విత్తన రాజకీయం చేస్తున్నాయని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ఆరోపించారు. రైతులు కోరుకునే డిమాండ్ రకం విత్తనాలతో పాటు ఇతర అన్ని రకాల కంపెనీల విత్తనాలు అందుబాటులో ఉండేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు.శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయన కలెక్టరేట్‌లో కలెక్టర్ రాజర్షిషాను కలిసి మాట్లాడారు. జిల్లాలో విత్తనాల కొరత లేకుండా చూడాలన్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలని, విత్తన దుకాణాల వద్ద బారులు తీరకుండా అవసరమైన విత్తనాలను తెప్పించే విధంగా చొరవ చూపాలని కోరారు. ఒకేరకం విత్తనాలను కోరుకోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి నెలకొందని అన్నారు.ఇతర రకాలపై అవగాహన కల్పిస్తే ఈ సమస్య తప్పకుండా తీరుతుందన్నారు.అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం విత్తన కొరతను తీర్చేలా పకడ్బందీ చర్యలు చేపడుతోందని అన్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రైతుల సంక్షేమమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నట్టు స్పష్టం చేశారు.కానీ ప్రతిపక్షాలు విత్తనం కొరత ఉందని అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, రైతులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని,సీఎం రేవంత్‌రెడ్డిని బాద్నాం చేయాలనే ఆలోచనతోనే ఈ కుట్రలు పన్నుతున్నాయని వారు ఆరోపించారు. విత్తన రాజకీయం మానుకోవాలని బీజేపీ, బీఆర్ఎస్‌లను హెచ్చరించారు. తమది రైతుపక్ష పాతి ప్రభుత్వమని అన్నారు.ఒక రైతు బిడ్డగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకుసాగుతున్నారని, అందరికీ విత్తనాలు అందించడమే ధ్యేయంగా కంపెనీలతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతున్నలు ఎన్నో బాధలు పడ్డారని, అలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదనే తమ కాంగ్రెస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు.రైతులకు అన్నివిధాలుగా అండగా ఉంటామని,ఏరకమైతే కావాలంటున్నారో ఆ విత్తనాల కొరత లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాకు లక్షా 50 వేల రాశి 659 రకం అవసరం ఉందని, ఇప్పటివరకు 60 వేలు ఆదిలాబాద్ జిల్లాకు వచ్చాయని,త్వరలోనే మరో 90 వేల ప్యాకెట్లు సైతం సరఫరా అవుతాయని పేర్కొన్నారు.రైతులు నిశ్చింతంగా ఉండాలని భరోసానిచ్చారు.విత్తన దుకాణాలను సందర్శించిన కిసాన్ కాంగ్రెస్ నేతలు జిల్లాకేంద్రంలోని పలు విత్తన దుకాణాలను కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్‌రెడ్డి జిల్లా నేతలతో కలిసి సందర్శించారు. విత్తనాల స్టాక్ వివరాలు,ఇప్పటివరకు ఎంత అమ్ముడుపోయిందని,ఇంకా ఎంత మేర అవసరం ఉందనే వివరాలను విత్తన దుకాణ వ్యాపారులను అడిగితెలుసుకున్నారు.అలాగే అధిక ధరలకు విత్తనాలను విక్రయించరాదని,బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకోవద్దన్నారు.ఒకవేళ ఎవరైన ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని,దుకాణ లైసెన్సులు రద్దు చేయడంతోపాటు కేసులు సైతం నమోదు చేస్తుందని హెచ్చరించారు.రైతులవసరాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారం చేయొద్దని,వారికి తోడ్పాటును అందించే విధంగా సేవా దృక్ఫథంతో విత్తన విక్రయాలు జరపాలని సూచించారు.అటు రైతులతో మాట్లాడుతూ పలు సూచనలు చేశారు.వారికి ధైర్యం ఇచ్చారు. ఒకేరకం కంపెనీ విత్తనాలు కాకుండా ఇతర రకాలను కూడా సాగు చేసుకోవాలని సూచించారు.మిగతా కంపెనీల విత్తనాలు కూడా దిగుబడులు అధికంగా వస్తాయని శాస్త్రీయంగా నిరూపితమైందన్నారు.ఎవరూ అపోహలకు గురికావొద్దని పేర్కొన్నారు.విత్తనాల విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతరం చేస్తున్నాయని,రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇటీవల ఆదిలాబాద్‌లో లాఠీచార్జి జరిగిందన్నది అవాస్తవమని పేర్కొన్నారు.తమది రైతు పక్షపాతి ప్రభుత్వమని,అందరికీ అన్ని రకాల విత్తనాలు అందించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విశేష కృషి చేస్తున్నారన్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులను నయవంచన చేసిందని,అనేక బాధలకు గురిచేసిందని గుర్తు చేశారు.ఆ కష్టాల నుండి గట్టెక్కించేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.రైతులకు సరిపడా విత్తనాలను అన్ని మండలకేంద్రాల్లోని సీడ్స్ దుకాణాల్లో అందుబాటులో ఉంచుతామన్నారు.గందరగోళానికి గురికాకుండా ప్రభుత్వంపై విశ్వాసం ఉంచాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా అంతకుముందు జిల్లా వ్యవసాయశాఖ అధికారి కార్యాలయాన్ని సందర్శించి డీఏఓ పుల్లయ్యను కలిశారు.జిల్లాలో విత్తన కొరత,ఇతర పరిస్థితులపై ఆరాతీశారు.పలు వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మల్లేష్, ఉప అధ్యక్షులు వెంకటరెడ్డి, మాజీ జడ్పీటీసీ కొండ గంగాధర్, మావల మండల అధ్యక్షుడు కుంబోజి రాములు, బేల మండల అధ్యక్షుడు గాన్ శ్యామ్, నిర్మల్ జిల్లా జనరల్ సెక్రెటరీ పోతారెడ్డి,కాంగ్రెస్ నాయకులు గిమ్మ సంతోష్,నవీన్‌రెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చరణ్‌గౌడ్, ఎన్ఎస్‌యూఐ శాంతన్ రావు, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు, అసెంబ్లీ జనరల్ సెక్రటరీ సామ రూపేష్‌రెడ్డి, దామోదర్ రెడ్డి, రంజిత్ రెడ్డి,ఇతర నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.