సిరా న్యూస్,ఆదిలాబాద్
ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐతో విచారణ చేయించాలి : ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐతో విచారణ చేయించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ లో భారతీయ జనతా పార్టీ చేపట్టిన ధర్నాలో రాష్ట్ర నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అత్యున్నత స్థానాలలో ఉన్న జడ్జీల, ప్రతిపక్ష ప్రధాన నాయకుల , రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లను టాపింగ్ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడిన బీఆర్ఎస్ నాయకులు, అధికారులపై వెంటనే సీబీఐ విచారణ చేపట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుతూ వారి పట్ల మెతక వైఖరిని ప్రదర్శిస్తుందన్నారు. ఎన్నికల సమయంలో కాలేశ్వరం , మేడిగడ్డ ప్రాజెక్టుపై జరిగిన అవినీతిపై సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేసిన నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు విచారణ చేపట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో కేవలం కేసులు పెట్టి చేతులు దులుపుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు లాంటిదని అన్నారు. అలాంటి వెన్నుపోటు దారులను కాంగ్రెస్ ప్రభుత్వం వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సెట్టింగ్ జడ్జితో గాని సిబిఐతో గానీ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు డాక్టర్ లక్ష్మణ్, తదితర రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.