ఫిదా అవుతున్న జనసేన

సిరా న్యూస్,కాకినాడ;
ఏపీలో కీలక నియోజకవర్గం పిఠాపురం. అందరి దృష్టి ఆ నియోజకవర్గంలో పైనే ఉంది. పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే అందుకు కారణం. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేశారు పవన్. కానీ ఓటమి ఎదురైంది. ఈసారి మాత్రం ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని పవన్ భావించారు. కాపు సామాజిక వర్గంతో పాటు మెగా అభిమానులు అధికంగా ఉండే పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. పవన్ తరఫున సినీ ప్రముఖులు వచ్చి ప్రచారం చేశారు. మెగా కుటుంబం మొత్తం తరలివచ్చింది. అయితే అందరికంటే మాజీ ఎమ్మెల్యే, టిడిపి ఇన్చార్జ్ వర్మ పవన్ గెలుపు కోసం అహోరాత్రులు శ్రమించారు. ఎన్ని రకాల ఒత్తిళ్లు వచ్చినా తట్టుకొని పనిచేశారు. పవన్ ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తానని కూడా శపధం చేశారు.వాస్తవానికి పిఠాపురంలో వర్మకు గట్టిపట్టు ఉంది. గతంలో ఆయనకు టిక్కెట్ రాకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుపొందారు. గత ఐదు సంవత్సరాలుగా నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశారు. తప్పకుండా గెలుస్తానని ధీమాతో ఉన్నారు. సరిగ్గా ఇదే సమయంలో పొత్తులో భాగంగా జనసేనకు సీటు కేటాయించడంతో తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారని ప్రచారం కూడా జరిగింది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే చంద్రబాబు వర్మను పిలిచారు. ప్రత్యేకంగా చర్చించారు. దీంతో వర్మ మెత్తబడ్డారు. ఆ మరుసటి రోజు నుంచి పవన్ కోసం ప్రచారం ప్రారంభించారు.అయితే వర్మను ఇండిపెండెంట్ గా పోటీ చేయించేందుకు, లేకుంటే వైసీపీలో చేర్పించేందుకు అధికార పార్టీ చాలా రకాలుగా ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. వందల కోట్లు ఆఫర్ చేసినట్లు ప్రచారం జరిగింది. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకోసం వైసిపి ప్రయత్నించిందని చెప్పుకొచ్చారు. వందల కోట్ల రూపాయలు సైతం ఆఫర్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. కానీ వర్మను కొనుగోలు చేసే శక్తి ఎవరికీ లేదని తేల్చి చెప్పారు. తనకు ఇద్దరు అధ్యక్షులని.. ఒకరు చంద్రబాబు, మరొకరు పవన్ కళ్యాణ్ అని చెప్పుకొచ్చారు. పవన్ కోసం తన భార్య, కుమారుడు సైతం ప్రచారం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తన బావమరిదికి ముఖ్యమైన ఆపరేషన్ జరిగిందని..ఇటువంటి సమయంలో పిఠాపురం నియోజకవర్గాన్ని విడిచిపెడితే తప్పుడు సంకేతాలు వెళతాయని తాను వెళ్లలేదన్నారు. చంద్రబాబు ఆదేశాలు తనకు కీలకమని.. పవన్ గెలుపు కోసం కృషి చేయడం ఆనందంగా ఉందని వర్మ చెబుతున్నారు. అయితే వర్మ కామెంట్స్ కు జనసైనికులు ఫిదా అవుతున్నారు. నేరుగా ఫోన్ చేసి అభినందనలు తెలుపుతున్నారు.
===============

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *