తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి

సిరా న్యూస్;
-నేడు ఆయన జయంతి

రావి నారాయణరెడ్డి ప్రముఖ స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, నిజాం పాలన వ్యతిరేక విమోచనోద్యమకారుడు మరియు రాజకీయ నాయకుడు. జూన్ 5, 1908న భూస్వామ్య కుటుంబంలో నల్గొండ జిల్లా భువనగిరి మండలం బొల్లేపల్లిలో జన్మించారు. ప్రాథమిక విద్య బొల్లేపల్లి, భువనగిరిలలో చదివారు. ఆ తర్వాత హైదరాబాదులోని రెడ్డి హాస్టల్ లో ఉండి హైస్కూలు పూర్తిచేశారు. చాదర్ ఘాట్ హైస్కూలులో ఎస్సెస్సెల్సీ, నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్ అభ్యసించారు.

విద్యార్థి దశలోనే స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళారు. కాకినాడ వెళ్ళి సత్యాగ్రహంలో పాల్గొన్నారు. గాంధీ సిద్ధాంతాలకు ఆకర్శితుడై స్వగ్రామం బొల్లేపల్లిలో ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పారు. 1933లో హైదరాబాదులో ఏర్పాటైన హరిజన్ సేవా సంఘానికి కార్యదర్శిగా పనిచేశారు. తొలినాళ్ళలో ఆర్యసమాజ్ ప్రభావానికి లోనైననూ చివరకు సోవియట్ రష్యా పురోభివృద్ధికి ఆకర్షితుడై కమ్యూనిష్టుగా మారినారు. 1934లో పోచంపల్లిలో సీతాదేవితో వివాహం జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటంలో ఈమె కూడా పాల్గొన్నది.

1941లో చిలకూరులో జరిగిన ఆంధ్రమహాసభకు, 1944లో భువనగిరి ఆంధ్రమహాసభకు, 1945లో ఖమ్మంలో జరిగిన సమావేశానికి రావి నారాయణరెడ్డి అధ్యక్షత వహించారు. 1944లో రావి అధ్యక్షత వహించిన భువనగిరి ఆంధ్రమహాసభలో అతివాద, మితవాద వర్గాల అభిప్రాయ భేదాల కారణంగా రెండుగా చీలిపోయింది. కమ్యూనిష్టు అధీనంలోకి వచ్చిన దానికి రావి నారాయణరెడ్డి అధ్యక్షత వహించారు. 1946-51 కాలంలో తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారు. నిజాం నిరంకుశ పాలనకు, భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాగిన ఈ పోరాటంలో 4 వేల గ్రామాలకు చెందిన లక్షలాది ప్రజలు పాల్గొన్నారు. ఈ పోరాటం ఫలితంగా 10లక్షల ఎకలారల భూమి పేదరైతులకు దక్కింది.

1952లో తొలి సార్వత్రిక ఎన్నికలలో రావి నారాయణరెడ్డి భువనగిరి నుంచి లోకసభకు పోటీచేసి దేశంలోనే అధికంగా (నెహ్రూ కంటె) మెజారిటీ సాధించారు. 1957, 1962లలో భువనగిరి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1957లో శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. రావి నారాయణ రెడ్డి 1967లో స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి విరమణ పొందారు. ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. వందకుపైగా పాఠశాలలు, వసతి గృహాలు నిర్మించారు. భూమి లేని నిరుపేదలకు తన 200 ఎకరాల సొంత భూమిని దానం చేశారు. పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు బీబీనగర్ – నడికుడి మార్గం కోసం పోరాడారు. బొల్లేపల్లి పరిధిలోని నాగిరెడ్డిపల్లి రైల్వేస్టేషన్ కు ఉచితంగా స్థలాన్ని ఇచ్చారు. ఈ స్టేషన్ కు రావినారాయణరెడ్డి రైల్వేస్టేషన్ గా నామకరణం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా అమలులోకి రాలేదు. 1978లో ఆంధ్రవిశ్వవిద్యాలయం నుంచి కళాప్రపూర్ణ బిరుదును అప్పటి గవర్నర్ శారదా ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నారు. 1991 సెప్టెంబరు 7న మరణించారు. మరణానంతరం 1992లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ బిరుదు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *