సిరాన్యూస్, ఆదిలాబాద్
ప్రజల తీర్పును స్వాగతిస్తాం: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* అందరి సమిష్టి కృషి వల్లే అత్యధిక ఓట్లు సాధించాం
* ఓటమితో నైరాశ్యం చెందకుండా ప్రజాసేవకు అంకితమవుతాం
* కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డవారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు
ఎంపీ ఎన్నికల్లో ప్రజల తీర్పును స్వాగతిస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవా భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ నైతిక విజయం కాంగ్రెస్ దేనని అన్నారు. పురుషులతో సమానంగా మహిళలు కూడా రాజకీయాల్లో రాణించాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదివాసీ మహిళ ఆత్రం సుగుణక్కకు టికెట్ కేటాయించిందన్నారు. అందరి సమిష్టి కృషి వల్లే ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో గతంలో ఎన్నిడూ లేనివిధంగా కాంగ్రెస్ ఓట్లు సాధించిందన్నారు. ఇదే తమ గొప్ప విజయంగా అందరం భావిస్తున్నామని తెలిపారు. బీజేపీ నాయకులు సంబరాలు చేసుకోవడం కాదని, గొప్పలకు పోకుండా ప్రజా సేవకు అంకితం కావాలని బీజేపీ నేతలకు హితవు పలికారు. ఒకవేళ వీర్రవీగితే ప్రజలే తగినరీతిలో బుద్ధి చెబుతారన్నారు. ప్రజలే న్యాయ నిర్ణేతలని వారి తీర్పును అందరూ స్వాగతించాల్సిందేనని స్పష్టం చేశారు. అటు పార్లమెంట్లో ఓటమి చెందడానికి కొందరు కాంగ్రెస్ నేతలే కారణమని కొన్ని మీడియా సంస్థలు అసత్య ప్రచారం చేశాయని, అందులో వాస్తవంలేదని అన్నారు. అందరూ కష్టపడి పనిచేశారని, గెలుపు బాధ్యతలను తమ భుజాలకెత్తుకున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో కీలకపాత్ర పోశించే మీడియా వాస్తవాలను ప్రతిబించేలా ప్రసారాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మేము పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లమని, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఉన్నవాళ్లమని పేర్కొన్నారు. తమపై అవాస్తవాలను ప్రచారం చేసి ఆత్మస్థైర్యం దెబ్బతీయొద్దని కోరారు. బీజేపీ దూకుడుగా వ్యవహరించడం, పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలకు దిగడం వంటి చర్యలతోనే ఇవాళ అనైతికంగా విజయం సాధించిం దన్నారు. పార్టీ గెలుపు కోసం కృషి చేసినవారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
* గెలుపోటములు సహజం….ప్రజల మధ్యనే ఉంటా: ఆత్రం సుగుణక్క
ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, తాను ఓడినా నిత్యం ఆదిలాబాద్ పార్లమెంట్ ప్రజల మధ్యలోనే ఉంటానని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతోనే…ఒక గొప్ప ఆశయంతోనే తన ఉపాధ్యాయ ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. గెలిస్తే పొంగిపోయేది లేదు..ఓడితే కుంగేది లేదని.. నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారు ప్రశ్నించే గొంతుకగా ఉంటానని తెలిపారు. వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. ఎంపీగా విజయం సాధించి ప్రజాసేవే లక్ష్యంగా, నియోజకవర్గంలో అభివృద్ధి చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. ఇప్పుడు ఓటమి చెందిన కుంగిపోకుండా ప్రజల్లో ఉంటూ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్పారు. ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చామని, ప్రజల తీర్పును తప్పకుండా గౌరవిస్తామని తెలిపారు. ఎన్నికల్లో తనకు అన్నివిధాలా అండగా ఉండి ముందుకు నడిపించిన మంత్రి సీతక్క, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేష్, జిల్లా అధ్యక్షులకు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిలకు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌కు, మాజీ ఎమ్మెల్యేలకు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే తనను ఆదరించిన ఓటరు మహాశయులకు ధన్యవాదాలు తెలిపారు.
* ఓటమితో నైరాశ్యం చెందకుండా ప్రజాసేవకు అంకితం: కంది శ్రీనివాసరెడ్డి
బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కుకావడంవల్లే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించలేకపోయిందని, బీఆర్ ఎస్ దగ్గరుండి బీజేపీకి ఓట్లు వేయించిందని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. అయినా గతం కంటే ఎక్కువగానే ఓట్లు సాధించాగలిగామని తెలిపారు. కాంగ్రెస్‌ను ఓడించడమే లక్ష్యంగా వారు కలిసి పనిచేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు సమర్థవంతంగా పనిచేశారు కాబట్టే రెండు లక్షల ఓట్లు అధికంగా సాధించామని స్పష్టం చేశారు. అటు దేశంలో బీజేపీ మీద వ్యతిరేకతోనే ఇండియా కూటమి సత్తా చాటిందన్నారు. దేశవ్యాప్తంగా అత్యధిక సీట్లు సాధించి మళ్లీ పుంజుకుందన్నారు. అయోధ్యలోనే రాముడి ఆశీర్వాదం బీజేపీకి లభించలేదని, అక్కడ ఘోర పరాభవం చెందిందని అన్నారు. చాలాచోట్ల ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమి గట్టి పోటి ఇచ్చిందని తెలిపారు. ఈ మీడియా సమావేశం లో నిర్మల్ డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీ హరి రావ్, బోథ్ అసెంబ్లీ ఇంఛార్జి ఆడే గజేందర్, జైనథ్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి – వెంకట్ రెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధర్, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, ఎస్.యూ.ఐ జిల్లా అధ్యక్షులు రంగినేని శాంతన్ రావ్, ఆదివాసీ జిల్లా చైర్మన్ సెడ్మాకి ఆనంద్ రావ్ ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ ,పట్టణ అధ్యక్షులు గుడిపెల్లి నగేష్,,కౌన్సిలర్లు కలాల శ్రీనివాస్,ఎన్. కౌన్సిలర్ దర్శనాల లక్ష్మణ్, ఆవుల వెంకన్న, సాయి ప్రణయ్, జాఫర్ అహ్మద్, నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి, ఎం.ఏ షకీల్, పత్తి ముజ్జు, శ్రీలేఖ ఆదివాసీ, మొహమ్మద్ రఫీక్, మానే శంకర్, కయ్యుమ్, ఎల్మ రామ్ రెడ్డి పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.