హాస్యనటుడు, నూటొక్క జిల్లాల అందగాడు నూతన్ ప్రసాద్

సిరా న్యూస్;

-నేడు ఆయన జయంతి
హాస్యనటుడు, నూటొక్క జిల్లాల అందగాడు నూతన్ ప్రసాద్ అసలు పేరు తడినాధ వరప్రసాద్. 1970వ, 80వ దశకములో తెలుగు సినిమా రంగములో ప్రసిద్ధి చెందిన హాస్య నటుడు, ప్రతినాయకుడు. నూతన్ ప్రసాద్ 1945, డిసెంబర్ 12న కృష్ణా జిల్లా కైకలూరులో జన్మించాడు. బందరులో ఐటిఐ చదివిన ప్రసాద్, నాగార్జునసాగర్, హైదరాబాదులో ఉద్యోగాలు చేశాడు.
ఎచ్ఎఎల్ లో ఉద్యోగం చేస్తున్న సమయంలో రంగస్థల నటుడు, దరశ్శకుడైన భాను ప్రకాష్ పరిచయం అయ్యాడు. భాను ప్రకాష్ స్థాపించిన ‘కళారాధన’ సంస్థ తరపున ప్రదరర్శించిన ‘వలయం’, ‘ గాలివాన’, ‘కెరటాలు’ వంటి నాటకాలు ద్వారా నూతన్ ప్రసాద్ నాటకరంగానికి పరిచయమయ్యాడు. ఎ.ఆర్.కృష్ణ దర్శకత్వంలో మాలపల్లి 101 సార్లు ప్రదర్శించాడు.
1973 లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి అక్కినేని నాగేశ్వరరావు నటించిన అందాల రాముడు చిత్రంతో చిత్రరంగ ప్రవేశము చేశాడు. ఆ తరువాత నీడలేని ఆడది మొదలైన చిత్రాలలో నటించినా, ఈయనకు తొలి గుర్తింపు ముత్యాల ముగ్గు చిత్రంలో రావుగోపాలరావుతో పాటు ప్రతినాయకునిగా నటించడముతో వచ్చింది. ఈ చిత్రము విజయముతో తదుపరి అనేక చిత్రాలలో ప్రతినాయకుని పాత్రలు వచ్చాయి. అవన్నీ ఈయన తనదైన శైలిలో పోషించాడు. ఈయన తనదైన శైలిలో పలికే సంభాషణలతో ప్రతినాయక పాత్రలకు హాస్యవన్నె లద్దారు. అనేక చిత్రాలలో అగ్ర నటులైన నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఘట్టమనేని కృష్ణ, చిరంజీవి సరసన హాస్య, ప్రతినాయక, సహాయ మొదలైన విభిన్న పాత్రలు పోషించాడు. ఒక చిత్రంలో కథానాయకునిగా కూడా నటించాడు.
నూతన్ ప్రసాద్ సైతాన్గా నటించిన రాజాధిరాజు చిత్రముతో ఈయన నట జీవితము తారాస్థాయికి చేరుకొన్నది. 1984 లో సుందరి సుబ్బారావు చిత్రంలో నటనకు ఆయనకు నంది పురస్కారం లభించింది. 2005 లో ఎన్టీఆర్ పురస్కారం లభించింది. తన 365వ సినిమా ‘బామ్మమాట బంగారుబాట’ చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో గాయపడి కొంతకాలం నటజీవితామనికి దూరంగా ఉన్నా తిరిగి కోలుకుని నటించడం మొదలెట్టి, 112 సినిమాలలో నటించాడు. కాళ్ళు అచేతనావస్థలో ఉండిపోయిన కారణంగా పరిమితమైన పాత్రలనే పోషించగలిగాడు. ‘దేశం చాలా క్లిష్టపరిస్థితిలో ఉంది’ ‘నూటొక్క జిల్లాల అందగాడిని’ అనే డైలాగులు ప్రేక్షకాదరణ పొందాయ. ఎన్ని వైవిధ్యమైన పాత్రలు, ఏ ప్రాత పోషించినా ప్రాణం పోసేవాడు.. ప్రసాద్ దాదాపు 365 సినిమాల్లో నటించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
కొద్ది రోజులు రవీంద్ర భారతికి ఇన్‌ఛార్జ్ గా ఉన్నాడు. వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ అభిమాని. మార్చి 30, 2011 బుధవారం హైదరాబాదులో అనారోగ్యంతో కన్నుమూశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *