ధర్మానికి, అధర్మానికి జరిగిన యుద్దంలో ధర్మమే గెలిచింది…
– ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్
– గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని హామీ
– స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దం కావాలని పిలుపు
సిరా న్యూస్, ఆదిలాబాద్: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మానికి, అధర్మానికి జరిగిన యుద్దంలో ధర్మమే గెలిచిందని బీజేపీ పార్టీ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వాఖ్యానించారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం నిరాల గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా గెలవడం వెనుక సమిష్టి కృషీ ఉందని, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజల రుణం తీర్చుకోలేనిదని అన్నారు.
ప్రత్యేక పూజలు..
ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత స్వంత మండలమైన జైనథ్కు మొదటి సారిగా విచ్చేసిన ఆయనకు నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆయన్ను శాలువా, పూలమాలలతో సన్మానించారు. అనంతరం అక్కడి నుంచి నిరాల గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే, కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు.
స్థానిక సంస్థల ఎన్నికలు సిద్దం కావాలి…
స్థానిక సంస్థలకు ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రతీ ఒక్కరు సిద్దం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన విదంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం సత్తాచాటాలన్నారు. కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా, సైనికుల్లాగా స్థానిక సంస్థల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.