నేడు ప్రపంచ శరణార్థుల దినోత్సవం

సిరా న్యూస్;

ప్రపంచ శరణార్థుల దినోత్సవం ప్రతి ఏట జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ప్రపంచంలోని శరణార్థుల గురించి అవగాహన కలిపించడంకోసం ఈ దినోత్సవంను జరుపుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శరణార్థుల అంశం ప్రధాన సమస్యగా మారడంతో శరణార్థుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి 1950, డిసెంబర్ 14న ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థని ఏర్పాటు చేసింది. ప్రపంచంలో అనేక దేశాల్లో నిరంతరం జరుగుతున్న యుద్ధాలు, అంతర్గత పోరాటాల ఫలితంగా అనేకమంది ప్రజలు నిర్వాసితులై శరణార్థులుగా మారుతూనే ఉన్నారు. ఈ పరిణామాల కారణంగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2000, డిసెంబరు 4న సమావేశమై ప్రతి సంవత్సరం జూన్ 20న “అంతర్జాతీయ శరణార్ధుల దినోత్సవం” జరపాలన్న 55/76 తీర్మానాన్ని ఆమోదించింది. 2001లో తొలిసారి జరిగిన అంతర్జాతీయ శరణార్ధుల దినోత్సవాన్ని 1951లో జరిగిన శరణార్ధుల సదస్సు 50వ వార్షికోత్సవంగా గుర్తించారు. శరణార్థులందరినీ గౌరవించడం, వారి గురించి అవగాహన పెంచడం, వారికి మద్దతు తెలపడం వంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇతర అంతర్జాతీయ దినోత్సవాల మాదిరిగా ప్రపంచ శరణార్థుల దినోత్సవం సందర్భంగా ఉత్సవాలు జరుపుకునే రోజు కాదని, శరణార్థులు ఎదుర్కొంటున్న కష్టాలు, అమానవీయ పరిస్థితులు, వాటి వెనుక ఉన్న కారణాలు, వీటన్నిటిని గురించి ప్రపంచ మానవ సమాజానికి తెలియజేసి అవగాహన కల్పించేందుకు ఈ సందర్భాన్ని వినియోగించుకోవాలన్న ఉద్దేశ్యంతో ఐక్యరాజ్యసమితి, ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ (‘యునైడెట్ నేషన్స్ హైకమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ – యుఎన్‌హెచ్‌సిఆర్) పిలుపుమేరకు ప్రతి సంవత్సరం జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక పౌర సంఘాలు ప్రపంచ శరణార్థుల దినోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. యుద్ధం, హింస కారణంగా వారివారి స్వస్థలం నుండి పారిపోయి వచ్చిన వారిని ఆదరించి వారికి బతుకుదెరువు చూపెట్టాలని ప్రజలకు తెలుపుతున్నారు.
స్థానికంగా జరుగుతున్న ప్రపంచ శరణార్థుల దినోత్సవ కార్యక్రమానికి హాజరు కావడం, ప్రపంచ శరణార్థుల దినోత్సవ వీడియోలను చూడటం వాటికి ఇతరులకు పంపించడం, సోషల్ మీడియాలో శరణార్థులపై అవగాహన పెంచడం కార్యక్రమాలు జరుగుతాయి.

==============xxxx

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *