ఎమ్మెల్యే బయోపిక్…

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలుగు చలన చిత్ర పరిశ్రమకు, ప్రేక్షకులకు పరిచయం చేయవలసిన అవసరం లేని నటుడు సముద్రఖని. ఆయన నటుడు మాత్రమే కాదు… దర్శకుడు కూడా! మాస్ మహారాజా రవితేజ, ప్రియమణి జంటగా… ‘అల్లరి’ నరేష్, శివ బాలాజీ నటించిన ‘శంభో శివ శంభో’కు దర్శకుడు ఆయనే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన ‘బ్రో’ చిత్రానికీ దర్శకుడు సముద్రఖని. అయితే… దర్శకుడిగా కంటే నటుడిగా ఇప్పుడు ఆయన ఎక్కువ బిజీ. త్వరలో తెలుగులో ఆయన ఓ బయోపిక్ కూడా చేయబోతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’, మాస్ మహారాజా రవితేజ ‘క్రాక్’ సినిమాల్లో సముద్రఖని పాత్రలకు మంచి పేరు వచ్చింది. ‘క్రాక్’లో రౌడీ నుంచి రాజకీయ నాయకునిగా మారిన పాత్రలో కనిపించారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే… ఆయన ఓ రాజకీయ నాయకుని బయోపిక్ చేయబోతున్నారట. తెలంగాణ రాష్ట్రంలోని ఓ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఓ నిజాయతీ గల రాజకీయ నాయకుని జీవితం ఆధారంగా తెరకెక్కే బయోపిక్ సముద్రఖని చేయనున్నారని సమాచారం. ఆల్రెడీ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొదలు పెట్టారట. ఆయనకు సొంత ఇల్లు కూడా లేదని, ఇప్పటికీ సైకిల్ మీద తిరుగుతారనేది ప్రజలకు తెలిసిన విషయమే. రాజకీయం అంటే అవినీతి అని చాలా మంది ప్రజల్లో ముద్ర పడింది. అటువంటి ఈ రోజుల్లో ఓ ఎమ్మెల్యేకు కనీసం సొంత ఇల్లు కూడా లేదంటే ఆశ్చర్యమే. అవినీతి మచ్చ లేని వ్యక్తిగా, పేద ప్రజల ఆశ జ్యోతిగా ఇప్పటికీ ప్రశంసలు అందుకున్న ఆ నిస్వార్థ రాజకీయ నాయకుడి గురించి తెలిసిన వెంటనే సినిమా చేయడానికి సముద్రఖని ఓకే చెప్పారని తెలిసింది. ఈ తరం ప్రజలకు, ప్రేక్షకులకు ఆయన గురించి కచ్చితంగా తెలియాలని ఆయన దర్శక నిర్మాతలతో చెప్పారట. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన వివరాలను అధికారంగా వెల్లడించనున్నారు.నటుడిగా తనలో విభిన్న కోణాలు ఆవిష్కరించే పాత్రలకు సముద్రఖని వెంటనే ఓకే చెబుతున్నారు. తెలుగు సినిమాల్లో తొలుత విలన్ వేషాలు వేసిన ఆయన… ఆ తర్వాత నెమ్మదిగా రూటు మార్చారు. ‘బ్రో’ సినిమాలో హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబ పెద్దగా కనిపించారు. ‘విమానం’ సినిమాలో వికలాంగుని పాత్ర పోషించారు. ఎలాగైనా సరే కుమారుడిని విమానం ఎక్కించడం కోసం కాలు లేని ఆ తండ్రి ఎన్ని కష్టాలు పడ్డాడు? అనేది ప్రేక్షకుల చేత కంట తడి పెట్టించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *