-జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్
సిరా న్యూస్,బద్వేలు;
అన్నమయ్య జిల్లాలో విస్తృతంగా స్టాప్ డయేరియా క్యాంపెయిన్ లు నిర్వహించి డయేరియా నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అధికారులకు సూచించారు. శనివారంసచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి అతిసార కేసుల వ్యాప్తి (స్టాప్ డయేరియా క్యాంపెయిన్), తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు.రాయచోటి కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కొండయ్య, తదితరులు పాల్గొన్నారు.వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అధికారులతో మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో స్టాప్ డయేరియా క్యాంపెయిన్ లు విస్తృతంగా చేపట్టాలన్నారు. జిల్లాలో ఎక్కడా అతిసార కేసులు వ్యాప్తి చెందకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఇందుకోసం వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లాలన్నారు. జిల్లాలో అతిసార కేసుల వ్యాప్తి అరికట్టేందుకు కమ్యూనికేషన్ స్ట్రాటజీ, మానిటరింగ్ మెకానిజం అమలు చేయాలన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించి ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేయాలని, ఆశా వర్కర్ ల ద్వారా తక్కువ బరువున్న చిన్నారులకు జింక్ ప్యాకెట్లను అందించాలన్నారు. ఆరోగ్య శాఖ సహకారంతో స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులు అంగన్‌వాడీలలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ కార్నర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. చిన్నారుల్లో గ్రోత్ మానిటరింగ్ నిర్వహించడంపై అంగన్‌వాడీ వర్కర్లకు శిక్షణ ఇవ్వడం మరియు తక్కువ బరువున్న పిల్లలకు పోషకాహారం అందించడం చేయాలన్నారు. జిల్లాలో ఎక్కడా కూడా డయేరియా, అతిసార కేసులు వ్యాప్తి చెందకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు.
సంక్షేమ శాఖలు మెరుగ్గా పనిచేయాలి
జిల్లాలోని సంక్షేమ శాఖలు సమర్ధవంతంగా పనిచేయాలి. ఆయా సంక్షేమ శాఖల ద్వారా ప్రజల అవసరాలను గుర్తించగలిగి సమర్థవంతంగా అడుగులు వేస్తే సంక్షేమం సార్థకమవుతుందని జిల్లా కలెక్టర్ యం. అభిషిక్త్ కిషోర్ సంక్షేమ శాఖల అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లోఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగ, మహిళ శిశు సంక్షేమం మరియు సంక్షేమ శాఖల కార్పొరేషన్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగ సంక్షేమ శాఖలలో ఏమేమి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు, అందులో భౌతిక, ఆర్థిక లక్ష్యం, సాధించిన ప్రగతి, జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు ఎన్ని, వాటిలో గల విద్యార్థుల సంఖ్య, హాస్టల్లోని సౌకర్యాలు, మెనూ, స్కాలర్షిప్స్, స్టడీ సర్కిల్స్, కమ్యూనిటీ హాల్స్ అంశాలు, అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖలో జిల్లాలో ఎన్ని ప్రాజెక్టులు, క్లస్టర్లు ఉన్నాయి, ఏయే పథకాలు అమలు చేస్తున్నారు, మహిళలు, పిల్లలకు అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు, వన్ స్టాప్ సెంటర్, దిశా, చైల్డ్ ప్రొటెక్షన్, ఆర్ఫన్ హోమ్స్, వికలాంగ శాఖ ద్వారా అమలుపరుస్తున్న పథకాలు, కార్పొరేషన్ల ద్వారా అమలు చేస్తున్న పథకాలు తదితరాలలో ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగ, మహిళా శిశు సంక్షేమం శాఖల పరిధిలో ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన అవసరాలు, ఎలాంటి సదుపాయాలు అవసరమో జిల్లా అధికారులకు తప్పనిసరిగా తెలిసి ఉండాలి. పిల్లలు కానీ మహిళలు కానీ సంక్షేమ శాఖల లక్షిత వర్గాల అవసరాలను గుర్తించాలి. ఏవైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటిని మరింత మెరుగ్గా పారదర్శకంగా ప్రజలకు అందజేయాలి. సహజంగా ప్రజల జీవితాన్ని మెరుగుపరచడానికే మనమందరం ప్రయత్నిస్తున్నాం. వారి అవసరాలు గుర్తించి ఆ దిశగా సమర్థవంతంగా అడుగులు వేస్తే సంక్షేమం సార్థకం అవుతుంది. ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో గుర్తించడానికి వివిధ మార్గాలలో మూలాలను గుర్తించాలి. జిల్లాలో ఎక్కడ ఏం జరుగుతోంది, ఎక్కడ వలసలు ఎక్కువగా ఉన్నాయి,మహిళల సమస్యలు ఏమిటి, రాయచోటి రాజంపేట మదనపల్లి డివిజన్ ప్రాంతాలలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడ ఏ ప్రాంతంలో ఎక్కువ పని చేస్తున్నవారు ఉంటారు, ఆ ప్రాంతంలో వారి అవసరాలు ఏమిటి సమస్య ఏంటి అన్నవి గుర్తించగలగాలి. ఉదాహరణకు ఎక్కడైనా ఒకచోట కమ్యూనిటీ హాల్ అవసరం ఉంటేనిబంధనల మేరకు ప్రభుత్వ పరంగా చేయలేకపోతే సామాజిక బాధ్యత కింద చేయవచ్చు.ఇందుకు ముందుగా అవసరాలను గుర్తిస్తే వాటికి తగినట్టుగా ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు ఏమేం ఉన్నాయి, ఏ విధంగా వీటిని సమన్వయం చేసి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించవచ్చునని ఆలోచన చేయాలన్నారు. మూస ధోరణిలో కాకుండా ఆచరణాత్మక దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలలో ఎవరైనా జీవనోపాధి గురించి చూస్తుంటేప్రభుత్వమే అని కాకుండా దాతలు లేదా ఇతరత్రా కూడా ముందుకు వచ్చిన వారిని సమన్వయం చేసుకొని ఒక యూనిట్ ఏర్పాటు చేసి ఉపాధి కల్పించినప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయి. అలాగే ఎక్కడైనా హాస్టల్లో కనీస సౌకర్యాలు లేనప్పుడు అందుబాటులో ఉన్న నిధులను ఉపయోగించి చేయాలి. లేదా స్థానికంగా ఎవరైనా దాతలను ప్రోత్సహించి వసతులు కల్పించవచ్చు. ఇక్కడ ప్రభుత్వం చేసిందా ప్రభుత్వేతర సంస్థలు, వ్యక్తులు చేశారా అన్నదానికంటే ప్రజలకు అవసరమైన వాటిని చేయగలిగామా లేదా అన్నది ముఖ్యం. చెయ్యడానికి ఏం లేదు కదా ఎందుకు తెలుసుకోవాలని అభిప్రాయం ఉండరాదనిమూస ధోరణి ఆలోచనలను మార్చుకొని అవసరమైన వారికి సహాయం అందించగలిగేలా చర్యలు ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ సందర్భంగామహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో “బేటి బచావో – బేటి పడావో” ప్రచార పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖల ఇన్చార్జి అధికారి వెంకటసుబ్బయ్య, బీసీ, మైనారిటీ సంక్షేమ అధికారులు సందప్ప, మస్తాన్, ఐసిడిఎస్ అధికారిని శశికళ, సిపిఓ కృష్ణా నాయక్, ఇండస్ట్రీస్ జిఎం సూరిబాబు, ఆయా శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
============================