ఈనెల 14న మకరాంపురంలో సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం
807 గ్రామాలకు మంచినీరు అందేలా రూ 700 కోట్ల తో నిర్మాణం
కిడ్నీవ్యాధి బాధిత ప్రాంతానికి సురక్షిత తాగునీరు
సిరా న్యూస్,శ్రీకాకుళం;
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం మరో కీలక ప్రగతికి నాంది పలకనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఈనెల 14న కంచిలి మండలం మఖరాంపురం గ్రామానికి రానున్నారు. అక్కడ జాతీయ రహదారి పక్కన నిర్మించిన వైఎస్సార్ సుజల ధార సురక్షిత తాగునీటి ప్రాజెక్టుని ప్రారంభిస్తున్నారు. జలజీవన్ మిషన్ లో భాగంగా ఏప్రిల్ 2020లో 700 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయి ప్రజలకు సురక్షిత నీటిని అందంచడానికి సిద్ధమైంది. హిరమండలం వంశధార రిజర్వాయిర్ నుంచి 100 కిలోమీటర్లుకు పైగా ప్రయాణించి ఉద్దానం ప్రాంతంలో మూత్రపిండాల వ్యాధులు తీవ్రంగా ఉన్న 807 గ్రామాల ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించనున్నారు.
ఈ బృహత్తర ప్రాజెక్టుకోసం హిరమండలం లోని వంశధార రిజర్వాయిర్ నుంచి నీటిని తరలిస్తున్నారు. అక్కడ మొత్తం నీటి నిల్వలు 19.359 టీఎంసీలు కాగా, ఇందులో శాస్వత నిల్వ 16.685 టీఎంసీలు, మిగిలింది డెడ్ స్టోరేజ్ గా 2.674 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. ఈ రిజర్వాయిర్ నుంచి ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలోని కవిటి, కంచిలి ,సోంపేట, ఇచ్చాపురం, మందస, వజ్రపుకొత్తూరు, పలాస మండలాల్లోని గ్రామాలకు ప్రతి ఏటా 1.12 టిఎంసీల నీటిని సరఫరా చేస్తారు. 807 గ్రామాల్లోని ప్రస్తుత లెక్కల ప్రకారం 6.78 లక్షల మందికి, మరో ముప్పైయ్యేళ్ళ తరవాత కూడా 2051 నాటికి 7.85 లక్షల మంది జనాభాకు తాగునీటి వసరాలు తీర్చే విధంగా దినిని రూపకల్పన చేశారు.ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రి సిదిరి అప్పలరాజు, జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించారు.