తెలంగాణ ప్రజల కరువులకు కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం ప్రాజెక్టు

తెలంగాణ ప్రజల కరువులకు కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం ప్రాజెక్టు
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
 సిరా న్యూస్,హైదరాబాద్ ;
తెలంగాణ ప్రజల కరువులకు కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం ప్రాజెక్టు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. మంగళవారం ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. తెలంగాణ తెర్లై పోతే సంకలు గుద్దుకుందామని చూసిన వంకరబుద్ధిగాళ్లకు ఈర్ష్య అసూయ పుట్టించి, కన్నుకుట్టించిన మా వరప్రదాయిని కాళేశ్వరం అని ప్రశంసించారు. తలాపున గోదారి గలగల పారుతున్న తనువంతా ఎడారై ఎండిన శాపానికి విమోచనం కాళేశ్వరం, సముద్ర మట్టానికి ఎత్తున ఉన్న మా చేను చెలకలు నదీ జలాలతో తడవాలంటే ఎత్తిపోతలే శరణ్యమని, దగాపడ్డ నేల దశాబ్దాలుగా జరిపిన గోదారి జలాల సాధన పోరాటాలకు సమాధానం కాళేశ్వరం అని కెటిఆర్ తెలియజేశారు.శిథిల శివాలయంగా పాడుబడిపోయిన శ్రీరామ్ సాగర్ కు పునరుజ్జీవమిచ్చిన పుణ్య వరం కాళేశ్వరం, నీళ్లు రాక..ఒట్టిపోయిన నిజాంసాగర్ కు నిండుకుండలా మార్చే అండ దండ కాళేశ్వరం, మండుటెండల్లో చెరువులను మత్తళ్లు దూకించిన మహాత్యం కాళేశ్వరం, మా తపనకు..ఆలోచనకు ..అన్వేషణకు జలదౌత్యానికి… నిదర్శనం కాళేశ్వరం అని కొనియాడారు. కాళేశ్వరం అంటే ఒక్క బరాజ్ కాదని తెలియని కాంగెస్ వారి అజ్ఞానం, ఎక్కడో ఒక లోపం తలెత్తడం సహజం సరిదిద్దుకోగలమని, రాజకీయ కుళ్ళు కుతంత్రాలను దిష్టి చూపులను తట్టుకోగలమని, మీ ఏడుపే మా ఎదుగుదల అని కెటిఆర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *