సిరాన్యూస్, భీమదేవరపల్లి
మళ్లీ మూతపడ్డ గొల్లపల్లి ప్రభుత్వ పాఠశాల
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాల సదుపాయాలను కల్పిస్తున్నప్పటికీ విద్యార్థులు లేక పాఠశాలలు వెలవెలబోతున్నాయి. విద్యార్థుల లేమితో పాఠశాలలు మూతబడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గొల్లపల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు లేకపోవడంతో గతంలో మూతపడింది. గత నెలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మూతబడ్డ పాఠశాలలను మళ్లీ రీ ఓపెన్ చేశారు. అందులో భాగంగా గొల్లపల్లి గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం నిర్వహించి 15 మంది విద్యార్థులతో గ్రామంలోని పాఠశాలను మళ్ళీ రీ ఓపెన్ చేశారు. కానీ నేడు ఆ పాఠశాల విద్యార్థులు లేకపోవడంతో మూతపడింది. ఏండ్లుగా మూతపడ్డ గొల్లపల్లి ప్రభుత్వ పాఠశాలను విద్యాధికారులు తిరిగి రీ ఓపెన్ చేసిన గ్రామస్తులు వారి పిల్లలను పంపించడానికి ఆసక్తి చూపించడం లేదు. దీనిపై మండల విద్యాధికారి వెంకటేశ్వర్లను వివరణ కోరగా పాఠశాలను పునః ప్రారంభించి ఒక ఉపాధ్యాయురాలిని నియమించినా, విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లల్ని పంపించడం లేదని, విద్యార్థులు లేకపోవడంతో పాఠశాలను మళ్లీ మూసేసినట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యాధికారులు, ఉపాధ్యాయులు సరైన అవగాహన కల్పించకపోవడం వల్లే ప్రభుత్వ పాఠశాల మళ్ళీ మూతపడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.