దాసరి ఉష, హన్మయ్యపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి

సిరా న్యూస్,పెద్దపల్లి ప్రతినిధి:
ఎన్నికల సమయంలో ప్రచార రథం ఢీకొని చావుబతుకుల్లో కొట్టు మిట్టాడుతున్న బాధితురాలికి న్యాయం చేయాలని, ఆమె దుస్థితికి కారణమైన దాసరి ఉష, ఆమె తండ్రి హ్యన్మయ్యపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని మహనీయుల ఆశయ సాధన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బొంకూరి కైలాసం డిమాండ్ చేశారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2023 అక్టోబర్ 20న పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంట గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఎస్పీ అభ్యర్థి దాసరి ఉష ప్రచార రథం ఢీకొని గ్రామానికి చెందిన జిల్లాల అంజమ్మ తీవ్రంగా గాయపడి అచేతన స్థితిలో ఉందన్నారు. అప్పట్లో బాధితురాలికి పూర్తి వైద్య ఖర్చులు, కోలుకునే వరకు తామే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చిన ఉష, హమ్మయ్య అప్పుడు వైద్యం చేయించారని తెలిపారు. వైద్యం పూర్తి స్థాయిలో అందక తిరిగి బాధితురాలికి ఆపరేషన్ అవసరం ఏర్పడిందని, ఈవిషయంపై తాము మర్యాదపూర్వకంగా అడిగితే హేళన చేశారని వాపోయారు. దళితులమనే భావనతో చులకనగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం సుద్దులు చెప్పే ఉష బాధిత మహిళ పట్ల ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. దగా పడ్డ మహిళకు అధికారులు న్యాయం చేయాలని, ప్రచార రథాన్ని వాడిన దాసరి ఉష బాధితురాలికి వైద్యం పూర్తి స్థాయిలో చేయించాలని డిమాండ్ చేశారు. స్పందించకుంటే బాధిత మహిళ పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో కండె కరుణాకర్, ఈదునూరి చంద్రయ్య, ఆనంద్, దేవయ్య, నందయ్య, జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *