-నేడు ఆయన 86వ జయంతి
సిరా న్యూస్;
మంథని ముద్దు బిడ్డ, శాసన మండలి మాజీ సభ్యులు, పర్యావరణ పరి రక్షకుడు, అలుపెరుగని రాజకీయ పోరాట ధీరుడు గీట్ల జనార్ధనుడు… మంథని రాజకీయాల్లో మేరు నగధీరుడు గీట్ల జనార్ధన రెడ్డి.. మంథని మండలం నాగారం గ్రామానికి చెందిన గీట్ల జనార్ధన రెడ్డి అపర రాజకీయ మేధావిగా పేరు సంపాదించుకున్నాడు.మంథని మండలం గుంజపడుగు ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.రామగుండం మండలం అడ్డగుంట గ్రామపంచాయతీ సర్పంచ్ గా రెండు దఫాలు ఎన్నికై ముందు చూపుతో పారిశ్రామిక ప్రాంత అభివృద్ధికి విశేష కృషి చేశారు. ముక్కు సూటి తత్వంతో వ్యవహరించే జనార్ధన రెడ్డి రాజకీయాల్లో అడుగడుగునా ఆటంకాలు ఎదుర్కొన్నారు. అడ్డగుంట నుంచి నేరుగా మంథని కేంద్రంలో సొంత ఇల్లు నిర్మించుకుని పూర్తిగా రాజకీయాల్లో మునిగిపోయారు.అనేక డిగ్రీలు సాధించిన గీట్ల జనార్ధన్ రెడ్డి ఏ రంగం గురించైనా, ఏ అంశం గురించైనా గాని కూలంకుశంగా విడమరిచి చెప్పేవారు. నిస్వార్ధమైన రాజకీయాలు నడపాలని ఆశించేవారు. మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందేలా చేయాలని ఎంతగానో తపించారు.మంథని సర్పంచ్, సమితి ప్రెసిడెంట్ గా పోటీ చేసి ఓటమిని చవిచూశారు.ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై తెలుగుదేశం పార్టీలో చేరారు. మంథని నియోజకవర్గంలో గ్రామ గ్రామాన తెలుగుదేశం పార్టీని విస్తరింపజేశారు.ఎన్టీ రామారావు వ్యూహకర్తలుగా వేసిన మేధావుల కమిటీలో ఐదుగురు మేధావులు ఉండగా అందులో నాదెండ్ల భాస్కర్ రావు, శ్రీనివాసులు రెడ్డి ఇంద్రారెడ్డి, కెసిఆర్ తో పాటు జనార్దన్ రెడ్డి కూడా ఉన్నారు. జనార్దన్ రెడ్డిని ఎన్టీ రామారావు గురుతుల్యునిగా సంబోధించే స్థాయిలో గుర్తించబడ్డారని అంటుంటారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభంజనం ప్రారంభమైంది.పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే జరిగబోయే అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ జనార్దన్ రెడ్డికి వస్తుందని అంతా అనుకున్నారు. జనార్దన్ రెడ్డి మంథని నియోజక వర్గంలో పార్టీని బలోపేతం చేస్తూనే హైదరాబాద్ విక్రాంత్ లాడ్జిలో మకాం వేసి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు అందుబాటులో ఉంటూ తగిన సమాచారం కోసం ఎప్పటికప్పుడు చూస్తున్నారు.మంథని టికెట్ తనకు వచ్చేలా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.కానీ తన రెడ్డి వర్గంతో ఉన్న విభేదాల వల్ల జనార్దన్ రెడ్డికి టికెట్ రాకుండా అడ్డుకున్నారనే ప్రచారం ఉన్నది.అదే సమయంలో ఇందిరా గాంధీతో ఏర్పడ్డ విభేదాల వల్ల ఆమె పెద్ద కోడలు స్వర్గీయ సంజయ్ గాంధీ భార్య మేనక గాంధీ సంజయ్ విచార్ మంచ్ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు.ఈ క్రమంలో జనార్దన్ రెడ్డిని రాజకీయాల్లో అడ్డుకునేందుకు మంథని, కరీంనగర్ జిల్లాలో ఉన్న రెడ్లు ఒక్కటై మేనక గాంధీని తెరపైకి తీసుకువచ్చారని అంటుంటారు.సంజయ్ విచార్ మంచ్ అధినేత్రి మేనక గాంధీని కలిసిన రెడ్లు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ గురించి వివరంగా చెప్పి ఆంధ్ర రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు.తద్వారా రాజకీయ ప్రయోజనం చేకూరుతుందని నమ్మకంగా చెప్పారు.ఈ నేపథ్యంలో మేనక గాంధీ ఎన్టీ రామారావును కలిసి తను మీ తోబుట్టువునని తనకు తెలంగాణలో ఐదు సీట్లు ఇవ్వాలని కోరారు.ఇంటికి వచ్చి కోరిన ఆడబిడ్డ మాట కాదనలేక ఐదు సీట్లు ఎన్టీఆర్ ఇచ్చారు. అందులో మంథని, పెద్దపెల్లి చెన్నూరు, తదితర 5 నియోజకవర్గాలు ఉన్నాయి.ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే కేవలం జనార్ధన రెడ్డికి టికెట్ రాకుండా చేయడానికి మేనక గాంధీని ఆంధ్ర రాజకీయాల్లోకి తీసుకువచ్చారనీ తెలుస్తోంది.నిఖార్సైన వ్యక్తిత్వం గల జనార్ధన రెడ్డి ఎమ్మెల్యేగా గెలిస్తే తమకు అడ్డంకిగా తయారవుతాడని1982 నుంచి రాజకీయ ఎత్తులు,జిత్తులు చిత్తులు చాప కింద నీరులా మొదలయ్యాయి. జనార్ధన రెడ్డి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో తన ప్రత్యర్థి రెడ్డి వర్గం నుంచి తెలుగుదేశం పార్టీ టికెట్ చంద్రపట్ల రాజిరెడ్డి దక్కించుకున్నారు.ఇందిరా కాంగ్రెస్ నుంచి దుద్దిల్ల శ్రీపాదరావు తెలుగుదేశం పార్టీ నుంచి చంద్ర పట్ల రాజిరెడ్డి తలపడగా రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ విజయ డంక మోగించి 200 పైచిలుకు స్థానాలు సంపాదించగా మంథని నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీపాదరావు విజయం సాధించారు.శాసనసభ ఎన్నికల అనంతరం ఎన్టీ రామారావు సంస్కరణల బాట పట్టి పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు పరిచారు.అదే సమయంలో మండలాలు ఏర్పాటు చేసి ఐదంచెల ఎన్నికల విధానాన్ని పంచాయతీ రాజ్ చట్టంలో అమలుపరిచారు .ఎన్టీ రామారావు విధానాలతో రాజకీయాలకు ఆకర్షితులైన యువకులు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలుగా గెలుపొంది తమ సత్తా నిరూపించుకున్నారు.తను రాజకీయ గురువుగా భావించే గీట్ల జనార్దన్ రెడ్డికి రాజకీయంగా,పదవుల పరంగా అన్యాయం జరిగిందని గుర్తించిన ఎన్.టి.రామారావు కృష్ణాజిల్లా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి గురుదక్షిణగా ఇచ్చారు.ఎమ్మెల్సీగా రెండు సంవత్సరాలు కొనసాగిన గీట్ల జనార్ధన్ రెడ్డి అనూహ్యంగా రాజకీయాలనుంచి క్రమక్రమంగా దూరమై సాహితీవేత్తగా పలు పుస్తకాలు ప్రచురించారు. అందులో దుగ్ధగీతి, జ్వాలా తోరణాలు, తదితర పుస్తకాలు ఉన్నాయి.వచన రచనలో,గేయ రచనలో, కవిత్వంలో చేయి తిరిగిన గీట్ల జనార్దన రెడ్డి మంథనినీ అభివృద్ధి చేయాలనుకున్న కలలు రాజకీయ పరిస్థితులు అనుకూలించక ఫలించలేదు.మంథనికి వ్యవసాయ మార్కెట్ కమిటీని తీసుకువచ్చిన ఘనత గీట్ల జనార్ధన రెడ్డికి దక్కింది.ఆయన జ్ఞాపకంగా మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో గీట్ల జనార్ధన రెడ్డి విగ్రహం ఏర్పాటు చేయడం హర్షనీయం.సింగరేణి కాలరీస్ బొగ్గు గనుల వల్ల ఏర్పడే కాలుష్య నివారణకు జనార్దన్ రెడ్డి గోదావరి పర్యావరణ పరిరక్షణ ప్రదూషణ గవాక్షం (జిపిపిపిపిజి) అనే సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణకు విశేషంగా కృషి చేశారు.నిస్వార్థ రాజకీయ నాయకునిగా పేరుగాంచి మంథని ప్రజల గుండెల్లో గీట్ల జనార్ధన రెడ్డి చిరస్మరణీయునిగా నిలిచిపోయారు