సిరా న్యూస్, జైనథ్
తర్నం బ్రిడ్జిను సంరద్శంచిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని తర్నం బ్రిడ్జి ను నేషనల్ హైవే అథారిటీ అధికారులతో కలిసి ఎంపీ నగేష్ , ఎమ్మెల్యే పాయల్ శంకర్ గురువారం సందర్శించారు.ఇటీవల వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన తాత్కాలిక రోడ్డును వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తర్నం బ్రిడ్జ్ అంతరాయం వల్ల ప్రజలకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన బైలీ బ్రిడ్జి ఏర్పాటు చేసే విధంగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్నారు. సాధ్యమైనంత తొందరగా రాకపోకలను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా బ్రిడ్జి నిర్మాణ పనులు ఆలస్యమైందని అన్నారు. అదేవిధంగా నూతన బ్రిడ్జి కోసం నిధులు మంజూరయ్యాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుండి వచ్చిన నేషనల్ హైవే అథారిటీ ఆర్ఓ మాట్లాడుతూ ఇటీవల తనను ఎమ్మెల్యే పాయల్ శంకర్ కలిసి తర్నం బ్రిడ్జి సమస్యను తెలియజేశారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా తర్నం బ్రిడ్జి పరిసరాలను పరిశీలించడం జరిగిందన్నారు. నూతన బ్రిడ్జ్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు కొనసాగుతున్నాయని ఇప్పటివరకు నిధులు సైతం మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు దృష్ట్యా బైలీ బ్రిడ్జి ఏర్పాటుకు ఐదు కోట్ల వ్యయంతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభించి యధావిధిగా రవాణా సౌకర్యం ప్రారంభించి ప్రజల ఇబ్బందులను దూరం చేస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలపై స్పందిస్తున్న ఎమ్మెల్యేను ఈ సందర్భంగా అభినందించారు.