సిరా న్యూస్, భీమదేవరపల్లి
ముల్కనూర్‌లో “డ్రోన్” సేవలు …
* ముత్తారంలో వరి పంటకు పిచికారి
దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ముల్కనూర్ కో-ఆపరేటివ్ సొసైటీ రైతులకు అందుబాటులో ఇఫ్కో కిసాన్ “డ్రోన్” సేవలను అందిస్తున్నది. వ్యవసాయములో కూలీల కొరత అధికంగా ఉండడం, సాంప్రదాయ పద్ధతులలో వ్యవసాయం చేయడం వల్ల తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. వ్యవసాయంలో శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం సహాయంతో పంట ఉత్పత్తిని పెంచేందుకు కిసాన్ డ్రోన్ ప్రయోజనాలను సాధారణ చార్జీలతో రైతులకు ముల్కనూర్ సొసైటీ కల్పిస్తున్నది. ఇందులో భాగంగా మొదటిసారిగా ముత్తారంలో కాశిరెడ్డి ఆదిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో వరి పొలంలో ద్రవ వ్యవసాయ రసాయనాలను పిచికారి చేశారు. స్ప్రేయర్ తో పోలిస్తే తక్కువ సమయంలో ఎక్కువ ఎకరాలకు స్వల్ప వ్యవధిలో పిచికారి చేయవచ్చు. డ్రోన్ సహాయంతో చాలా నీటి ఆదా అవుతుంది. ఈ సందర్భంగా రైతు కాశిరెడ్డి ఆదిరెడ్డి మాట్లాడుతూ, కేవలం 15-20 ని.లలో రెండు ఎకరాలకు పిచికారి చేసినట్లు తెలిపారు. రైతులకు “డ్రోన్” సేవలను అందుబాటులో తీసుకొచ్చిన ములకనూరు సొసైటీకి కృతజ్ఞతలు తెలిపారు. డ్రోన్ ఆపరేటర్ శశి, మాడుగుల బాబు మాట్లాడుతూ, ఇది రైతులకు చక్కటి అవకాశం అని, రైతులకు ఆర్థిక చేయూత కల్పిస్తుందన్నారు.