దారి వారి సొంత జాగీరా

అక్రమ పార్కింగ్ కు నిలయంగా ఇండోర్ స్టేడియం, కలెక్టర్ కార్యాలయం ప్రధాన రహదారి…
ఇష్టనుసారంగా రోడ్డు మార్జిన్లు ఆక్రమణ…
రోడ్డుకి ఇరువైపులా ప్రైవేట్ స్కూల్ బస్సులు, కారులు…
నిత్యం ఈ దారిపై రాకపోకలు సాగిస్తున్నా చర్యలు చేపట్టని అధికారులు…
ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగుల, అవస్థలు…
 సిరా న్యూస్,ఏలూరు;
అది ఏలూరు ఇండోర్ స్టేడియం మెయిన్ గేటుకు వెళ్లే రహదారి. ఈ మార్గంలో పలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి. నిత్యం జిల్లా కలెక్టర్, మండల అధికారులు, ఉద్యోగులు, రాకపోకలు సాగిస్తుంటారు. అయితే రహదారికి ఇరువైపులా ప్రైవేటు విద్యా సంస్థల బస్సులు, వాహన యజమానులు అక్రమ పార్కింగ్ చేయడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రతిరోజు సాయంత్రం 4:30 నుండి 7:30 గంటల వరకు వాహనాలను నిలిపి ఉంచడంతో దారి కుచించుకుపోయి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. నిత్యం ఈ మార్గంలో అధికారులు రాకపోకలు సాగిస్తున్నా వాహనాల అక్రమ పార్కింగ్ ను తొలగించే ప్రయత్నం చేయడం లేదు. దీంతో వాహన యజమానులు ఈ రహదారిని సొంత జాగీరులా మార్చుకున్నారు.
మధ్యలో ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని పార్కింగ్ జోన్ గా వినియోగించుకుంటున్నారు. అక్రమ పార్కింగ్ వల్ల ప్రభుత్వ కార్యాలయాలకు ప్రధాన దారి కుచించుకుపోయింది. గతంలో ఇరుకుగా ఉన్న ఈ రహదారిని విస్తరణ చేపట్టారు. అక్రమ పార్కింగ్ వల్ల ప్రయోజనం లేకుండా పోయింది. సామాన్య ప్రజలు, ఉద్యోగులు, వృద్ధులు, విద్యార్థులు, తీవ్ర అవస్థలు పడుతున్నారు. దారికి ఇరుకుగా మారి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
దీనికి తోడు రహదారిపై ఆవులు, కుక్కల సంచారంతో సమస్య తీవ్రంగా ఉంది. ద్విచక్ర వాహన చోదకులకు ఆవులు, కుక్కలు అడ్డువచ్చి అదుపుతప్పి గాయాలపాలవుతున్నారు. ఇక మద్యం తాగి వాహనాలు నడపడం, మైనర్లు, ట్రిపుల్ రైడింగ్ తో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
* ఇష్టనుసారంగా రోడ్డు మార్జిన్లు ఆక్రమణ
ఇదే ప్రాంతంలో గజం స్థలం కనపడిన అక్రమార్కులు ఆక్రమించేస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రంథాలయం రిజిస్టర్ ఆఫీస్ ఈ మూడు కోడళ్ళు ఉన్న ప్రాంతం అక్రమాకులకు కల్పతరువుగా మారింది. రోడ్డు మార్జిన్ లను ఆక్రమించేసి చిన్నచిన్న దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ దుకాణాలను పలువురికి వేలాది రూపాయలకు అద్దలికిస్తూ కాసులు దండుకుంటున్నారు. గత వైకాపా ప్రభుత్వంలో అనేకమంది అక్రమణలకు పాల్పడినట్లు తెలుస్తోంది. కొందరు పలుకుబడి ఉపయోగించి దర్జాగా అక్రమంగా చేస్తున్నారు. అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరించడం గమనార్హం.. ఇప్పటికే మున్సిపల్ అధికారులు స్పందించి ఈ ప్రాంతంలో ఉన్న ఆక్రమణలను తొలగించాలని, పోలీసులు, రవాణా శాఖ, అక్రమ పార్కింగ్ ను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
=======================xx

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *