షాకిస్తున్న టమాటాలు

సిరా న్యూస్,విజయనగరం;
రాష్ట్ర వ్యాప్తంగా గత నెలరోజులుగా టమాటా ధరలు మండిపోతున్నాయి. అంతకు ముందు దాకా వందకు ఐదారు కిలోలంటూ వ్యాపారులు వెంటపడి మరీ అంటగట్టారు. కొన్ని ప్రాంతాలలో గిట్టుబాటు ధర రాక టమాటా రైతులు మార్కెట్ ఛార్జీలు కూడా తమకు గిట్టుబాటు కావడం లేదని రోడ్డుపైనే పంటంతా పారబోసి తమ నిరసన వ్యక్తంచేసిన వార్తలు చూశాము. ఈ సారి మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో టమాటా ధరలు సామాన్యులకు అందుబాటులోకి లేని స్థాయికి చేరుకున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈ సారి తెలుగురాష్ట్రాలలో అధిక ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. తర్వాత సకాలంలో వర్షాలు సైతం కురవకపోవడంతో టమాటా దిగుబడి భారీ స్థాయిలో పడిపోయింది.ఇప్పటికే ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు టమాటా విక్రయదారులు. యావరేజ్ న రూ.50 నుంచి 60 రూపాయల దాకా అమ్మకాలు ఉంటున్నాయి. అయితే అనూహ్యంగా విశాఖపట్నం మార్కెట్ లో టమాటా ధరలు వ్యాపారులు కేజీ రూ.100కి పెంచేశారు. టమాటా దిగుబడి తగ్గిపోవడంతో తప్పనిసరిగా రేటు పెంచాల్సి వచ్చిందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ విషయంలో రైతులు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. గత ఏడాది గిట్టుబాటు ధర లభించక నానా అవస్థలు పడ్డామని..ఈ ఏడాది ఆ నష్టాన్ని కూడా రికవరీ చేసే విధంగా టమాటా ధరలు పెరగడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.సామాన్యులు మాత్రం కేవలం ఒక్క వంద రూపాయలే టమాటా పై పెడితే మిగిలిన కూరగాయలను కొనుగోలు చేసేదెలా అని ఆందోళన పడుతున్నారు. తాము మధ్యతరగతి కుటుంబానికి చెందినవారమని ప్రతినిత్యం ఉల్లిపాయలు, టమాటాలు తమ వంటలలో చేరుస్తామని..కేవలం కూరగాయలతో వంటలు చేసుకోవాలంటే తలకు మించి భారమవుతుందని..దానికి టమాటాలు చేర్చడం ద్వారా కలిసి వస్తుందని అంటున్నారు. అసలే నిత్యావసరాలు పెరిగిపోయాయని బాధపడుతుంటే ఇప్పడు కామన్ మ్యాన్ ఇష్టపడి తినే టమాటా రేటు కూడా పెరిగిపోతే ఏం తినాలి తాము అని అడుగుతున్నారు. కొందరు దళారీలు టమాటాలను గోడౌన్ లలో నిలవ చేసి రేటు అధికంగా అమ్ముకుంటున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి.కూరగాయల హోల్ సేల్ మార్కెట్ కు కూడా టమాటాలు తక్కువ సంఖ్యలో వస్తున్నాయి. మేమే కిలో 50 రూపాయలకు కొనుగోలు చేస్తున్నామని వ్యాపారవేత్తలు చెబుతున్నారు. కనీసం పదో, ఇరవయ్యో ఎక్కువగా అమ్ముకోకపోతే ఎలా అని వ్యాపారులు ఎదురు ప్రశ్నిస్తున్నారు. విశాఖలో పెరిగిన టమాటా ఎఫెక్ట్ ఇప్పుడు ఏవీ వ్యాప్తంగానే కాక పొరుగున ఉన్న తెలంగాణపైనే పడేలా ఉంది. ఇప్పటికే హైదరాబాద్ లో ఏ1 గ్రేడ్ టమాటాలు రూ.100కి అమ్ముతున్నారు. ఇప్పవు సాధారణ రకం కూడా వందకు పెరిగేలా ఉందని కొనుగోలు దారులు గగ్గోలు పెడుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *