శిశుపాలుడు ఎవరో ఎవరి పాపం పండిందో ఎన్నికల్లో ప్రజలే చెప్పారు కదా జగన్

మంత్రి నారా లోకేశ్
సిరా న్యూస్,అమరావతి;
50 రోజుల పాలనలో అన్నింటా విఫలమైన కూటమి ప్రభుత్వం భయపడుతోందని, ప్రభుత్వం వేసే ప్రతి అడుగులో భయం కనిపిస్తోందని. చంద్రబాబు ఎంతగా భయపడుతున్నాడంటే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోతున్నాడని జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.తాజాగా, మంత్రి నారా లోకేశ్ కూడా జగన్ పై విరుచుకుపడ్డారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ ఇంకా తత్వం బోధపడినట్టు లేదని ఎద్దేవా చేశారు.ఈ 50 రోజుల ప్రభుత్వంలో మేం భయంతో ఉండడం కాదు. ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల బాధ్యతతో ఉన్నాం. మీరే ఇంకా భ్రమల్లో ఉన్నారు. అధికారం దూరమైందన్న బాధ, అక్రమార్జన ఆగిపోయిందన్న ఆవేదన, ఉనికిని చాటుకోలేకపోతున్నామనే మీ నిస్పృహ, ఫేక్ రాజకీయం పండడం లేదనే ఫ్రస్ట్రేషన్, ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఉక్రోషం. మీ మాటల్లో, మీ చేష్టల్లో, మీ కుట్రల్లో అడుగడుగునా కనిపిస్తున్నాయి.జగన్ మీరు ఓ విషయం గుర్తించాలి. ప్రతిపక్ష హోదా కూడా రాని స్థాయిని మీకు కట్టబెట్టింది ప్రజలు. దానికి కారణాలు ఇప్పటికైనా తెలుసుకోండి, వాస్తవాలు అంగీకరించండి. జగన్ ఇంకా ఇలాగే వ్యవహరిస్తుంటే, తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా ఉంటే. మొన్న ఎన్నికల్లో 151లో 5 మాయం అయ్యింది, ఇప్పుడు 11లో ఒకటి మాయం అవుతుంది.శిశుపాలుడు ఎవరో, ఎవరి పాపం పండిందో మొన్న ప్రజలే తేల్చిచెప్పారు. ఐదేళ్ల పాటు మీరు సాగించిన విధ్వంసాన్ని 50 రోజుల్లోనే మా కూటమి ప్రభుత్వం తుడిచివేయలేదంటూ మీరు చేసే విషప్రచారం ప్రజామోదం పొందదు. ఇక భయం గురించి అంటారా. ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించిన మాకెందుకు భయం? ఎవరిని చూసి భయం? మీ తీరు చూస్తుంటే మొన్నటి ఓటమి భయం మిమ్మల్ని తీవ్రంగా వెంటాడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది, అని నారా లోకేశ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *