నేడు కార్గిల్ విజయ్‌ దివస్‌

-1999, జూలై 26న భారతదేశ సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించిన రోజు
-కార్గిల్ యుద్ధంలో వీర మరణం పొందిన అమరవీరులకు ఆశ్రు నివాళులు
సిరా న్యూస్;
కార్గిల్ విజయ దినోత్సవాన్ని జూలై 26న దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. 1999, జూలై 26న భారతదేశ సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించిన దానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద జరిగే వేడుకల్లో దేశ ప్రధాని పాల్గొని అమర జవానులకు నివాళులు అర్పిస్తారు. కార్గిల్ యుద్ధం 1999లో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగింది. భారత్-పాకిస్థాన్‌ల మధ్య మే 8న కార్గిల్ యుద్ధం ప్రారంభమైంది. మనదేశంలోని లడఖ్, ఇతర సరిహద్దుల వద్ద ఉన్న వాస్తవాధీన రేఖను దాటి పాకిస్థాన్ సైన్యం మనదేశంలోకి ప్రవేశించింది. దీంతో భారత్ యుద్ధం చేసేందుకు సిద్ధమైంది. ఈ యుద్ధం సుమారు మూడు నెలలపాటు సాగింది. 1999, జులై 4న 11 గంటలపాటు సుదీర్ఘ యుద్ధం చేసిన అనంతరం భారత్ తిరిగి టైగర్‌హిల్స్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోగలిగింది..జులై 26న అప్పటి భారత ప్రధానమంత్రి భారత అటల్ బీహారీ వాజ్‌పాయి ఆపరేషన్ విజయ్(కార్గిల్ యుద్ధం) విజయవంతమైందని ప్రకటించారు. పాకిస్థాన్ దళాలు మనదేశంలో ఆక్రమించిన ప్రాంతాల నుంచి వెనుదిరిగాయని సైన్యాధికారులు వెల్లడించారు.ఈ యుద్ధంలో సుమారు 520 మంది సైనికులు అమరులయ్యారు. ఈ యుద్ధంలో పాల్గొన్నవారిలో నలుగురు పరమవీర చక్ర, తొమ్మిదిమంది మహావీర్ చక్ర, 53మంది వీర్ చక్ర మెడల్స్ అందుకున్నారు. కార్గిల్ విజయ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు, కార్యక్రమాలు జరుగుతాయి. ప్రజలంతా వాటిలో పాల్గొని సైనికులకు వందనాలు అర్పిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *