సిరాన్యూస్, చిగురుమామిడి
వసతులు లేని.. వసతి గృహం
* కాలిపోయిన వాటర్ ఫ్రిడ్జ్
* ఇబ్బందుల్లో విద్యార్థులు.. పట్టించుకోని అధికారులు
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని షెడ్యూల్ కులాల బాలుర వసతి గృహం సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఎన్నో సంవత్సరాల కిందట నిర్మించిన భవనం ఇలా శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడు కూలుతుందో తెలియని స్థితిలో ఉంది. ప్రస్తుతం ఇక్కడ 21 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అటు తల్లిదండ్రులు సైతం ఆందోళన చెందుతున్నారు. కొత్త భవనం ఏర్పాటు ప్రతిపాదన కార్యరూపం దాల్చడం లేదు. దీంతో అసౌకర్యాల నీడనే పేద బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు చదువులు కొనసాగించాల్సిన దుస్థితి ఏర్పడింది. వసతి గృహాల్లో విద్యత్ సౌకర్యం అంతంత మాత్రంగానే ఉంది. విద్యార్థులు ప్రతిరోజు ఉపయోగించే వాటర్ ఫ్రిజ్జు గత కొద్ది నెలలుగా పాడైపోయింది. ఇంతవరకు రిపేర్ చేయలేదు. ఒకే కరెంట్ మీటర్ ఉండడంతో 17 గదుల్లో ఒకే సమయంలో ఫ్యాన్లు బల్బులు వెలగడం లేదు.ఓ వర్ లోడ్ తో ఫ్రిజ్జు పాడైపోవడం, కరెంటు వైర్లు కాలిపోవడం జరుగుతుంది. మరమ్మతులు చేయించాలని విద్యుత్ శాఖ వారికి ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని అధికారులు చెబుతున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వసతి గృహంలో వసతులు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.