సిరా న్యూస్, హైదారాబాద్:
అసెంబ్లీ ఎదుట విద్యార్థి సంఘాల నాయకుల ఆందోళన
విద్యార్థి సంఘాల నాయకుల అరెస్ట్
విద్య రంగానికి బడ్జెట్లో నిధులు పెంచి కనీసం 30శాతం నిధులు కేటాయించాలని, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, ఉద్యోగుల ఖాళీలపై అసెంబ్లీలో ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ -పీవైఎల్ సంఘాల నాయకులు అసెంబ్లీ ముట్టడించారు. అసెంబ్లీ వద్ద ఐదు అంచల భద్రత వలయాలను ఛేదించుకొని మెరుపు వేగంతో ఒక్కసారిగా నినాదాలతో మెయిన్ గేట్ ముందు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు పి. మహేష్ ,పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఇందూరి సాగర్, పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ లు మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్న విద్యారంగం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టకపోవడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో విద్యారంగానికి కనీసం 15శాతం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చి కేవలం 7.36శాతం నిధులు కేటాయించడం సిగ్గుచేటు అన్నారు. 2 లక్షల 97 వేలకోట్ల రూపాయల బడ్జెట్ లో కేవలం 21 వేల కోట్లు విద్యారంగానే కేటాయించడం తీవ్రమైన నిర్లక్ష్యం అన్నారు. ఈ కేటాయింపులు కేవలం టీచింగ్ ,నాన్ టీచింగ్ సిబ్బంది జీతభత్యాలకే సరిపోవు అన్నారు. విద్యారంగానికి సరిపోయే నిధులు కేటాయించకుండా విద్యా కమిషన్ ఏర్పాటుచేసినా ఉపయోగం లేదన్నారు. బడ్జెట్ ను సవరించి విద్యారంగానికి నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులు కాంపిటేటివ్ పరీక్షలు వాయిదా వేయాలని ఆందోళన చేస్తా ఉంటే అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం నేడు త్వరలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని దాటవేత ధోరణిని ప్రదర్శిస్తుందన్నారు. ఇది విద్యార్థులను నిరుద్యోగులను తీవ్రమైన మోసం చేయడమే అన్నారు. రాష్ట్రంలో ఇంతవరకు విద్యాశాఖకు ప్రత్యేకమైన మంత్రి లేకపోవడం సరి కాదన్నారు. దీంతో విద్యారంగ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో దాదాపు 8 వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. వాటికి ప్రత్యేకమైన గ్రాంట్లు విడుదల చేసి యుద్ధ ప్రాతిపదికను విద్యార్థులకు చెల్లించాలన్నారు.ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలేబోయిన కిరణ్, డి శ్రీకాంత్, జన్నారపురాజేశ్వర్, గడ్డం శ్యామ్, మస్తాన్, పీవైఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధరావత్ రవి, వనమాల సత్యం, నాయకులు కంచనపల్లి శ్రీనివాస్, రానా ప్రతాప్ , శ్రీనివాస్, సింహాద్రి, బండి రవి, పాపయ్య ఉమా శంకర్, వంశీ,రహీం, గణేష్, తోపాటు వందమంది నాయకులను అరెస్టు చేసి హైదరాబాదు నగరంలో వివిధ పోలీస్ స్టేషనులకు తరలించారు.