సిరా న్యూస్,విశాఖపట్టణం;
ఉత్తరాంధ్రలో సీనియర్ నేత కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలో ఉన్నా లేనట్లేనా? ఆయన ఎందుకు యాక్టివ్ గా లేరు. అదే ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మచ్చలేని నేతగా గుర్తింపు ఉంది. వివాదాలకు దూరంగా ఉంటారు. కేవలం ఉత్తరాంధ్రకే పరిమితమై ఆ ప్రాంత సమస్యలనే ఎక్కువగా పట్టించుకుంటారు. నాలుగు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నా ఆయన గెలిచింది మాత్రం మూడు సార్లు మాత్రమే. 1989, 1991 లో కాంగ్రెస్ నుంచి అనకాపల్లి పార్లమెంటుకు పోటీ చేసి విజయం సాధించారు. 2004లో అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి మరొకసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అంతే తప్ప ఈయన రాజకీయ జీవితంలో గెలుపు కంటే ఓటములే ఎక్కువ.ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. వైఎస్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డారు. తర్వాత ఆయన కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరినా అక్కడా ఇమడలేకపోయారు. ఎక్కువ కాలం ఉండలేదు. విశాఖ పార్లమెంటులో వైఎస్ విజయమ్మ ఓటమి తర్వాత ఆయనను పార్టీ అధినాయకత్వం క్రమంగా దూరం పెట్టడం ప్రారంభించింది. అప్పటి నుంచి కొంత ఓపికపట్టి చివరకు పార్టీ నుంచి కొణతాల రామకృష్ణ బయటకు వచ్చేశారు. తర్వాత దశాబ్దకాలం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పోటీ కూడా చేయలేదు. ఉత్తరాంధ్ర సమస్యలపై గళమెత్తుతూ ఆయన తన ఉనికిని కాపాడుకుంటూ వచ్చారు. అన్ని పార్టీల అధినేతలను కలసి ఉత్తరాంధ్ర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాజకీయంగా కొంత పట్టుసంపాదించారు. ఎన్నికలకు ముందు… 2023 ఎన్నిలకు ముందు కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలో చేరారు. అనకాపల్లి శాసనసభ సీటును సాధించుకున్నారు.కూటమి వేవ్ విపరీతంగా వీయడంతో పాటు జనసేన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేట్ తో గెలవడంతో మొన్నటి ఎన్నికల్లో ఆయన కూడా విజయం సాధించారు. అనకాపల్లి నుంచి దాదాపు మూడు దశాబ్దాల తర్వాత చట్టసభల్లోకి అడుగు పెట్టారు. సీనియర్ నేతగా ఆయన పార్టీకి సేవలందించాలనుకున్నారు. కానీ ఎందుకో ఆయన పార్టీలోనూ యాక్టివ్ గా కనిపించడం లేదు. అలాగే సీనియర్ నేతగా, మచ్చలేని నేతగా ఆయనకు కేబినెట్ లో స్థానం దక్కుతుందని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా జనసేన కోటాలో ఆయన పేరు మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురయినట్లు తెలిసింది. ఖచ్చితంగా తనకు మంత్రి పదవి వస్తుందని ఆయన ఆశించారంటారు అయితే మంత్రి పదవితో పాటు పార్టీ పదవులు కూడా ఏమీ ఇవ్వకపోవడంతో కొంత పార్టీకి దూరంగానే ఉంటున్నారు. ఎన్నో ఏళ్లకు తాను ఎమ్మెల్యేగా గెలిచినా చివరకు మంత్రి పదవిరాకపోవడంతో ఆయన ఒకింత నిరాశకు గురయినట్లు సమాచారం. ఆయన సహచరులు, అనుచరులు కూడా తమనేతను పట్టించుకోవడం లేదన్న ఆవేదనను బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. అయితే కొణతాల రామకృష్ణ మాత్రం తాను ఎమ్మెల్యేగా ఉంటూ అనకాపల్లికి మాత్రమే పరిమితమయ్యారు. రాష్ట్ర స్థాయి నేత అయినా రాజకీయాలను పట్టించుకోవడం లేదు. తన సీనియారిటీని గుర్తించలేదన్న బాధ ఆయనలో కనిపిస్తుందని ఆయనను దగ్గర నుంచి చూసిన వారు చెబుతుండటం విశేషం. మరి ఈ పెద్దాయన జనసేనలోనైనా ఇమిడి పనిచేసుకుని వెళతారా? లేదా? అన్నది మాత్రం కొంత సందేహంగానే కనిపిస్తుంది.