సిరా న్యూస్,కర్నూలు;
పీ సీఎం చంద్రబాబు శ్రీశైలం మల్లన్న సేవలో గురువారం పాల్గొన్నారు. నంద్యాల, సత్యసాయి జిల్లాల పర్యటనలో భాగంగా తొలుత ఆయన శ్రీశైలం చేరుకున్నారు. ఉదయం హెలికాఫ్టర్‌లో సున్నిపెంటకు చేరుకున్న ఆయనకు మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్థన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, గొట్టిపాటి రవికుమార్, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం మల్లన్న ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మల్లన్న, భ్రమరాంభ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సీఎంకు వేద ఆశీర్వచనం అందజేసి, తీర్థ ప్రసాదాలు అందించారు. అధికారులు స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని చంద్రబాబుకు అందజేశారు. శ్రీశైల మల్లన్న సేవలో పాల్గొన్న అనంతరం సీఎం కృష్ణమ్మకు జలహారతి సమర్పించారు. అనంతరం శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు. ఆ తర్వాత నీటి పారుదల శాఖ అధికారులతో భేటీ అవుతారు. శ్రీశైలం పర్యటన ముగిసిన తర్వాత సత్యసాయి జిల్లా గుండుమలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో లబ్ధిదారులకు పింఛన్ అందిస్తారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు.