సిరాన్యూస్, భీమదేవరపల్లి
భార్యపై అనుమానంతో భర్త దండం రాజు ఆత్మహత్య
మండలంలోని మల్లారం గ్రామంలో భార్యపై అనుమానంతో భర్త దండం రాజు(27) గురువారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ముల్కనూర్ ఎస్సై నండ్రు సాయిబాబు తెలిపారు. రాజుకు 8 ఏళ్ల క్రితం రవళి తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. భార్య రవళి పై అనుమానంతో భర్త రాజు తాగుడుకు బానిస అయ్యాడు. ఈ క్రమంలో రవళి ఇటీవల చిట్టి కట్టేందుకు కొత్తకొండకు వెళ్ళగా రవళిని అనుమానించిన భర్త రాజు ఆమెను కొట్టాడు. దీంతో ఈనెల 25 వ తేదీన రవళి తన పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. పలుమార్లు ఇంటికి రావాలని పదేపదే అతని భార్య రవళికి ఫోన్ చేసిన పట్టించుకోలేదు. దీంతో తీవ్ర నిరాశకు లోనైనా దండం రాజు గురువారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తల్లి లింగవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నండ్రు సాయిబాబు తెలిపారు.