సిరాన్యూస్,భీమదేవరపల్లి
రాష్రానికి పెట్టుబడులు వస్తుంటే జీర్ణించుకోలేక పోతున్నారు: మంత్రి పొన్నం ప్రభాకర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్లి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తుంటే బిఆర్ఎస్ నాయకులకు కండ్లు మండుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు రైతు వేదికలో రైతుల అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉన్నత అధికారులతో కలిసి ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్తే, బిఆర్ఎస్ నాయకులు నాయకులు ముఖ్యమంత్రి కుటుంబ పరమైన అంశాలను తీసుకువచ్చి ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత పది ఏళ్లలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికి ఒక్కసారి కూడా విదేశాలకు వెళ్లలేదని, ఈ విషయమై బిఆర్ఎస్ నాయకులు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. బిఆర్ఎస్ అనుకూల పత్రికలో సుంకిశాల గోడ విరిగిపడిందని దానితో లింకు పెడుతూ తమ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సుంకిశాల బిఆర్ఎస్ హయాంలో చేసిన తప్పిదమని, దీనిపై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నామని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బిఆర్ఎస్ పదేళ్ల పాలన వైఫైల్యాలను తమ ప్రభుత్వం సరి చేసుకుంటూ వస్తుంటే, బిఆర్ఎస్ నాయకులు ఓర్వలేక తమపై బట్ట కాల్చి మీద వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంగా బిఆర్ఎస్ నిర్మాణాత్మక సలహాలిస్తే స్వీకరిస్తాం కానీ బట్ట కాల్చి మీద వేస్తే చూస్తూ ఊరుకునే ప్రభుత్వం తమది కాదన్నారు. సందెట్లో సడే మీయలాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రైతు రుణమాఫీ కానీ వారి పక్షాన బిజెపి ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని నిలదీయాలని అంటున్నాడని, కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాట్లాడడం చేతగాని మంత్రి కిషన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. రైతులకు రుణమాఫీ జరగకుంటే లోపాలను సవరణ చేసుకునే అవకాశం రైతులకు ఇస్తున్న ప్రభుత్వం తమదని గుర్తుంచుకోవాలన్నారు.