సిరా న్యూస్,చిత్తూరు;
తిరుత్తణి సమీపంలోని కనకమ్మసత్రం పక్కనే ఉన్న రామంచేరి గ్రామ సమీపంలో ట్రక్కు, కారు ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు వ్యక్తులను తిరువళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చారు. చెన్నై-తిరుపతి జాతీయ రహదారిపై తిరువళ్లూరు జిల్లా కనకమ్మసత్రం పక్కనే ఉన్న రామంచేరి గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో చెన్నై నుంచి తిరుత్తణి వైపు వస్తున్న లారీ, ఎదురుగా వస్తున్న కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న చెన్నైకి చెందిన ఏడు మంది ప్రైవేట్ కాలేజీ విద్యార్థుల్లో ఐదు మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు గాయపడ్డారు.
గాయపడిన ఇద్దరిని తిరువళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న కనకమ్మసత్రం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారు శిథిలాలలో చిక్కుకున్న వారి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.