హైదరాబాద్ లో హైడ్రా… పిడుగులు

 సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్‌లో వారం రోజులుగా అక్రమ నిర్మాణాలను విస్తృతంగా కూల్చివేస్తున్నారు. చెరువుల బఫర్ జోన్లలో నిర్మిస్తున్న వాటిని..నాలాలుకబ్జా చేసిన వాటిని కూల్చివేస్తున్నారు. గతంలో గ్రేటర్ హైదరాబాద్ అధికారులే ఆ పని చేసేవారు. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో హైడ్రా పేరుతో ప్రత్యేక వ్యవస్థను తీసుకు వచ్చారు. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ . హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేసి నిర్మాణాలను కూల్చి వేయడం.. ప్రభుత్వ ఆస్తుల సంరక్షణకు దీన్ని ఏర్పాటు చేశారు. గత కొద్ది రోజులుగా ఆక్రమణలపై హైడ్రా అధికారులు విరుచుకుపడుతున్నారు. రాజేంద్రనగర్‌ పరిధి శివరాంపల్లిలో చెరువును ఆక్రమించిన ప్లాట్లు వేసి నిర్మాణాలు చేపట్టారు. వాటిని కూల్చి వేస్తున్నారు. గాజుల రామారం చింతలచెరువు బఫర్ జోన్‌లో 52అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. జూబ్లీహిల్స్‌ నందగిరిహిల్స్‌ లేఅవుట్‌లోని పార్కు స్థలంలో అక్రమ నిర్మాణాలను సైతం హైడ్రా సిబ్బంది తొలగించారు. పార్కు స్థలంలో పాన్‌, కిరాణ దుకాణాలు, మరుగుదొడ్లు నిర్వహిస్తున్నారు. తాజాగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శివరాంపల్లి లో 18 ఎకరాల చెరువు లో కబ్జా కు గురైన 5 ఎకరాలలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చేశారు. మజ్లిస్ ఎమ్మెల్యే అడ్డుకున్నా వదిలి పెట్టలేదు. జీహెచ్‌ఎంసీ పరిధిలో చెరువులు, కుంటలు అన్నీ కలిపి 400కుపైగా ఉన్నాయి. నగరంలోని చెరువుల సంరక్షణను హైడ్రా ప్రధానంగా తీసుకుంటోంది. చాలా చెరువులు 60 శాతం, కొన్ని 80 శాతం ఆక్రమణలకు గురయ్యాయి. జీహెచ్‌ఎంసీ, దాని చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 గ్రామ పంచాయతీల వరకు హైడ్రా పవర్ ఫుల్‌గా ఉంటుంది. భారీ హోర్డింగులు, ఫ్లెక్సీల నియంత్రణ, తాగు నీటి పైపులైన్లు, విద్యుత్తు సరఫరా లైన్లు, డ్రైనేజీలు, వరద నిర్వహణ, ట్రాఫిక్‌ నియంత్రణలోనూ ఈ విభాగం సేవలందిస్తుంది. బఫర్‌ జోన్‌, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మాణాలు కట్టాలంటే భయపడే స్థితికి తీసుకొస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే హెచ్చరించారు.
హైడ్రాకు ప్రభుత్వం పెద్దఎత్తున సిబ్బందిని సమకూర్చనుంది. ప్రత్యేక పోలీస్‌ స్టేషన్‌ కూడా ఉంటుంది. మొదటి దశలో ఆక్రమణలను అడ్డుకోవడం హైడ్రా చేసే అని వివరించారు. రెండో దశలో ఆక్రమించి నిర్మించిన భవనాలపై చర్యలు, అనుమతుల నిరాకరణ ఉంటుందని హైడ్రా కమిషనర్ ప్రకటించారు. ప్రభుత్వం స్థలాలు కబ్జాకు గురైనట్లు ఎవరి దృష్టికి వచ్చినా వెంటనే 18005990099, 040–29560509, 040–29560596, 040–29565758, 040–29560593నంబర్లకు కాల్ చేయవచ్చని హైడ్రా ప్రకటించింది. తనను వ్యక్తిగతంగా కూడా కలవవొచ్చని.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *