భార్గవ్ స్థానంలో…అశోక్..

సిరా న్యూస్,తిరుపతి;
వైసీపీ అధినేత జగన్ పార్టీలో కీలకమైన విభాగాల్లో మార్పులకు శ్రీకారం చుట్టారా? పార్టీతోపాటు అన్ని విభాగాలను ప్రక్షాళన చేస్తున్నారా? ఎన్నికల తర్వాత సజ్జలను ఎందుకు దూరంగా పెట్టారు? ఆయన ఆలోచనలు బూమరాంగ్ అయ్యాయా? ఇప్పుడు జూనియర్ సజ్జలను సైడున పెట్టారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.వైసీపీ పాలనలో తోడుగా నిలిచినవారిని జగన్ దూరం పెడుతున్నట్లు తెలుస్తోంది. అన్నింటి కంటే ముందు తొలుత సజ్జల సేవలకు ముగింపు పలికారు. ఎన్నికల తర్వాత ఆయన పెద్దగా మీడియా ముందుకు రాలేదు. గతంలో మంత్రులుగా వ్యవహరించినవారు మాత్రమే మీడియా ముందుకు వచ్చి చెప్పాల్సిన నాలుగు మాటలు చెబుతున్నారు. దీంతో సజ్జలను దూరంగా పెట్టారనే వాదనలు లేకపోలేదు.ఇప్పుడు జూనియర్ సజ్జల వంతైంది. ఆయన సేవలకు ముగింపు పలకాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత సజ్జల భార్గవ్ దాదాపుగా కనుమరుగయ్యారు. దీంతో వైసీపీ సోషల్‌మీడియా వింగ్‌కు కొత్త బాస్‌ను ఎంపిక చేశారట. ఎన్నారై అశోక్‌రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. జగన్‌కి ఆయన సమీప బంధువు కూడా.ఇంతకీ అశోక్‌రెడ్డి ఎవరు? ఎక్కడ.. ఎవరికి దగ్గర ఇలా రకరకాల ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. అశోక్‌రెడ్డి ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి సోషల్‌మీడియా వ్యవహారాలు చూస్తున్నారట. అంతేకాదు ఆయన విజయమ్మకు దగ్గర బంధువు కూడా. ఆయన నియమాకంపై అధికారిక ప్రకటన రావాల్సివుంది. రానున్న ఐదేళ్లు వైసీపీకి కీలకం. అందులో ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్‌ను ఎదుర్కోవడం ఆషామాషీ కాదు.మరోవైపు వైసీపీలో కీలక మార్పులు ఉండనున్నట్లు వైసీపీ నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ విషయాన్ని పసిగట్టిన కొందరు నేతలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. మరికొందరు బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు అంతర్గత సమాచారం. పార్టీలో ఎలాంటి ఆరోపణలు లేని నేతలకు జిల్లా పగ్గాలను అప్ప గించాలన్నది అధినేత ఆలోచనగా చెబుతున్నారు. ఈ లెక్కన రేపోమాపో జిల్లాల అధ్యక్షుల జాబితా బయటకు రానున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *