జగన్ మౌనం.. దేనికి సమాధానం

సిరా న్యూస్,విజయవాడ;
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్‌గా ఉంటాయి. ఒకరు ఎత్తు వేస్తే.. మరొకరు పైఎత్తు వేస్తూ రాజకీయం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీకి చెందిన నేతలపై ఎప్పుడు ఓ కన్నేసి ఉంచుతారు. అందుకే లీడర్లు చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ.. కొందరు వైసీపీ లీడర్లు మాత్రం ఎన్నికల్లో ఓడిపోయినా మారడం లేదు. దీంతో ఆ పార్టీకి, పార్టీ అధినేతకు తీవ్ర నష్టం జరుగుతోంది. అయితే.. ఇలాంటి నేతలపై జగన్ ఏం చర్యలు తీసుకుంటున్నారు అని కేడర్ ప్రశ్నిస్తున్నారు.2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా వైసీపీ ఓడిపోయింది. దీంతో జగన్ కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్నా.. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై బయటకు వచ్చి స్పందించారు. దీంతో కేడర్ కాస్త యాక్టివ్ అయ్యింది. సరిగ్గా ఈ సమయంలోనే.. రాజకీయ ప్రత్యర్థులకు ఇద్దరు వైసీపీ నేతలు ఆయుధాలు ఇచ్చారు. వారిలో ఒకరు దువ్వాడ శ్రీనివాస్ కాగా.. మరొకరు ఎమ్మెల్సీ అనంతబాబు. వీరి వ్యవహారం ఇటీవల ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం దాదాపు 15 రోజులుగా ఏపీ రాజకీయాల్లో నానుతోంది. ఆయన భార్య వాణి 10 రోజుల పాటు ఆందోళన చేసింది. దివ్వెల మాధిరి అనే మహిళ కారణంగా దువ్వాడ శ్రీనివాస్ వారికి దూరంగా ఉంటున్నారని ఆరోపించింది. ఈ వ్యవహారం రాజకీయ రచ్చకు కారణమైంది. దీనిపై స్పందించిన జగన్.. దువ్వాడను టెక్కలి నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించారు. అప్పటికే రాజకీయంగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది.ఎమ్మెల్సీ అనంతబాబుపై గతంలోనే హత్యా ఆరోపణలు ఉన్నాయి. ఆయన జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఈ నేపథ్యంలో.. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంట్లో అనంతబాబు అభ్యంతరకరంగా వ్యవహరించారు. ఆ వీడియో నిజమా.. ఎడిట్ చేసిందా అనే విషయం పక్కనబెడితే.. రాజకీయంగా వైసీపీకి, జగన్‌కు నష్టం చేసింది. అనంతబాబు బయటకు వచ్చి వివరణ ఇచ్చేలోగా ప్రత్యర్థి రాజకీయ పార్టీ దాన్ని ఆయుధంగా వాడుకొని జగన్‌ను ఇరకాటంలోకి నెట్టింది.వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ పార్టీ నేతలపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అవంతి శ్రీనివాస్, అంబటి రాంబాబు ఆడియోలు అని చెప్పే వాయిస్ రికార్డింగ్‌లు రాజకీయ రచ్చకు కారణమయ్యాయి. అవి అసెంబ్లీలో మాటల యుద్ధానికి దారితీశాయి. ఆ తర్వాత హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం రచ్చ రచ్చ అయ్యింది. అది కూడా నిజమా.. అబద్ధమా అని తేలేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. జగన్ ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఇలాంటి ఘటనలు ఆయన్ను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి.ఇలాంటి ఆరోపణలను జగన్ పెద్దగా పట్టించుకోవడం లేదా అనే చర్చ జరుగుతోంది. తమ పార్టీ నేతలపై వచ్చిన ఆరోపణల గురించి స్పందించకపోయినా.. వారిపై చర్యలు తీసుకుంటే బాగుండేది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీకి జగనే బాస్ కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ఎదురించే వారు ఉండరు. కాబట్టి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలపై చర్యలు తీసుకుంటే బాగుండేదని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ఇకనైనా పార్టీకి తలనొప్పిగా మారే నేతలపై జగన్ కఠినంగా వ్యవహరిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *