సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో లెఫ్ట్ పార్టీలు,కాంగ్రెస్ మధ్య ఏదో జరుగుతోందన్న చర్చ ఇప్పుడు కీలకంగా మారంది. అధికారంలోకి వచ్చిన కొత్తలో.. అంతా సవ్యంగానే నడించింది కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మధ్య. అసెంబ్లీలో సీపీఐ సభ్యుడు కూనంనేని కూడా అధికారపక్షంతోనే ఆశీనులవుతూ.. అంశాలవారీగా ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ వస్తున్నారు. ఇటీవల రాఘవులు, జూలకంటి రంగారెడ్డి సహా పలువురు నేతలు సైతం సీఎం రేవంత్‌తో ములాఖత్ కావడంతో… సీపీఎం కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటుందన్న సంకేతాలు ఇచ్చారు. అయితే కొన్నాళ్లుగా లెఫ్ట్‌పార్టీలకు, కాంగ్రెస్‌కు మధ్య .. వ్యవహారం చెడినట్టుగా అనిపిస్తోంది. ఎర్ర పార్టీల తీరు, ఆ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే… అది నిజమే కావొచ్చన్న చర్చ పొలిటికల్‌గా రచ్చరేపుతోంది.రుణమాఫీ సహా హామీల అమలు వరకు…. హైడ్రా హడావుడి నుంచి కవిత్ బెయిల్ దాకా… ఇలా అంశమేదైనా, కాంగ్రెస్‌నేతలకు పూర్తి భిన్నమైన స్వరంతో ఎర్రనేతలు వ్యాఖ్యలు చేస్తుండటం ఆసక్తిరేపుతోంది. నిన్నమొన్నటి దాకా.. ప్రభుత్వం బాగానే పనిచేస్తుందంటూ కితాబు ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.. తాజాగా కొన్నాళ్ల నుంచి చేస్తున్న వ్యాఖ్యలు.. ఎక్కడో తేడా కొడుతోందన్నట్టుగా అనిపిస్తున్నాయి. ప్రధానంగా రుణమాఫీ విషయంలో ప్రభుత్వపెద్దలు చెబుతున్న వ్యాఖ్యలు ఒకలా ఉంటే.. మిత్రపక్షంగా వాటిని సమర్థించాల్సిన సీపీఐ.. మరోవిధంగా స్పందిస్తుండటం రాజకీయంగా ఏదో శకునాన్ని సూచిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రుణమాఫీ జరిగిపోయిందనీ… రైతులకు ఇప్పటివరకు ఈస్థాయిలో మేలు చేసింది తమ ప్రభుత్వమేనని… కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు.రుణమాఫీ అంశంలో.. ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ యుద్ధం చేయడం కామన్. కానీ, మిత్రపక్షంగా ఉన్న సీపీఐ కూడా… అదే తరహా వ్యాఖ్యలు చేస్తుండటం ఆసక్తి రేపుతోంది. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా రుణమాఫీ పూర్తిచేసి తీరాల్సిందేనంటున్న ఎమ్మెల్యే కూనంనేని… రైతులకు కండీషన్లు పెట్టడం కరెక్ట్ కాదంటున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ముందుకు వెళ్లకపోతే… ప్రభుత్వానికే నష్టమంటూ హెచ్చరిస్తున్నారు. ఇదే రుణమాఫీ విషయంలో… ఇటీవల ఖమ్మంలో మంత్రి తుమ్మలను సీపీఐ శ్రేణులు అడ్డుకోవడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది. మంత్రి తుమ్మల సర్దిచెప్పుకోవాల్సి వచ్చిందంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.అయితే, ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్న పార్టీ… ఇలా సడెన్‌గా ప్లేటు ఫిరాయించడం.. కాంగ్రెస్ శ్రేణులను సైతం విస్మయపరుస్తోంది. ఎందుకంటే, ఒక్క రుణమాఫీ విషయంలోనే కాదు.. హామీల అమలుపైనా ఎర్రన్నలు ఇలాంటి కామెంట్సే చేస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రభుత్వంలో కాదు.. ప్రజల పక్షాన ఉంటామంటూ ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యే కూనంనేని.. ఫ్యూచర్‌పై ఒక క్లూ వదిలారు. తాజాగా, బీఆర్‌ఎస్‌ఎమ్మెల్సీ కవిత బెయిల్ అంశంలోనూ హస్తం నేతలపై పరోక్షంగా కూనంనేని ఘాటుగా వ్యాఖ్యలు చేయడం ఆసక్తి రేపుతోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా విషయంలోనూ సీపీఐ.. స్పష్టత కోరుతోంది. పేదలు, మధ్య తరగతి ప్రజల జోలికి వెళ్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరిస్తోంది. అలా కూల్చాల్సి వస్తే.. వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది.మొత్తానికి, సిట్యుయేషన్ చూస్తుంటే… హస్తంతో ఎర్రన్నల బంధానికి బీటలుపడుతున్నట్టుందనే చర్చ.. రాజకీయవర్గాల్లో మొదలైంది. చెడిందా? లేక చెడబోతోందా? అనే డిస్కషన్ ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ కారిడార్‌లో జోరుగా జరుగుతోంది. అది నిజమో కాదో తెలియాలంటే.. ఇంకొన్నాళ్లు ఆగాలేమో..!