సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల నియామకంలో ఆయా పార్టీ అధిష్టానాలు దోబూచులాడుతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి నియామకం తర్వతే కలమదళం సారథిపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తుండగా.. బీజేపీ, బీఆర్ఎస్ పొలిటికల్ స్టెప్స్ పరిశీలించి… ఆ పార్టీల యాక్టవిటీస్పై ఓ అంచనాకు వచ్చాకే పీసీసీ బాస్ ఎవరన్నది తేల్చాలని కాంగ్రెస్ తాజాగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క్, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఏఐసీసీ పెద్దలు భేటీ అయిత తర్వాత ఒకటి రెండు రోజుల్లో పీసీసీ చీఫ్‌పై తేల్చేస్తామని చెప్పినా… మరో ఏడాదిపాటు సీఎం రేవంత్‌రెడ్డినే పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించి.. ఆ తర్వాత కొత్త వారిని నియమిస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదన పరిశీలిస్తున్నట్లు తాజాగా టాక్ వినిపిస్తోంది.ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి పదవీ కాలం నెల రోజుల క్రితమే పూర్తయింది. ఆయన స్థానంలో కొత్తవారిని నియమించాలని ఏఐసీసీ పలువురి పేర్లను పరిశీలిస్తోంది. ఐతే మంత్రివర్గం విస్తరణ, పీసీసీ నూతన కార్యవర్గం ఎంపిక ఒకదానికొకటి లింక్ ఉండటంతో ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడిని నియమించిన తర్వాతే బీజేపీ సారథిని ఎంపిక చేయాలనే ఆలోచనతో కమలనాథులు ఉన్నట్లు తెలుసుకున్న కాంగ్రెస్ హైకమాండ్ మరికొన్నాళ్లు వేచిచూస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో ఏడాదైనా రేవంత్‌రెడ్డిని కొనసాగిస్తే… అప్పటికి అసెంబ్లీ ఎన్నికలకు మూడేళ్లు సమయం ఉంటుందని… కొత్త సారథికి ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తే యాక్టివ్‌గా పనిచేస్తారని భావిస్తోందట ఏఐసీసీ… దీంతోనే పీసీసీ చీఫ్ నియామకాన్ని వాయిదా వేయాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది.వాస్తవానికి కాంగ్రెస్‌తోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని నియమించాల్సివుంది. రెండు పార్టీల్లోనూ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న ఇద్దరు నేతలు ఒకరు సీఎంగా మరొకరు కేంద్ర మంత్రిగా అధికార విధుల్లో బిజీగా ఉంటున్నారు. దీంతో పార్టీ కార్యక్రమాలు వెనకబడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి… వారి వారి పార్టీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు. కానీ, రెండు పార్టీల అధిష్టాన వర్గాలు మాత్రం ఇద్దరికి విముక్తి కల్పించడం లేదు.పీసీసీ కొత్త సారథులుగా బీసీ వర్గం నుంచి మహేశ్‌కుమార్ గౌడ్, మధు యాష్కీ పేర్లు పరిశీలనలో ఉండగా, ఎస్టీ కోటాలో బలరాం నాయక్, ఎస్సీ కోటాలో సంపత్‌కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక రాష్ట్రంలో కీలక సామాజిక వర్గాలైన రెడ్డి, వెలమ కులాలకు చెందిన నేతలు కూడా పీసీసీ చీఫ్ పీఠాన్ని ఆశిస్తున్నా సామాజిక సమీకరణల రీత్యా వారికి చాన్స్ లేదంటున్నారు. ఇదే సమయంలో బీజేపీ కూడా కాంగ్రెస్ ఎంపిక తర్వాతే తాను నిర్ణయం తీసుకోవాలని భావిస్తోందంటున్నారు. ఐతే బీజేపీలో బీసీలకు తప్ప వేరొకరికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో కాంగ్రెస్ నిర్ణయం కోసం వేచి చూడకుండా కొత్త అధ్యక్షుడిపై ప్రకటన చేయాలని బీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారుమొత్తానికి రెండు జాతీయ పార్టీలు కొత్త అధ్యక్షుడిని నియమించే విషయంలో ఒకరి నిర్ణయం కోసం ఒకరు వేచిచూడటమే తెలంగాణలో పొలిటికల్‌గా హాట్‌టాపిక్ అవుతోంది. ఒక పార్టీ రాష్ట్రంలో.. మరోపార్టీ కేంద్రంలో అధికారంలో ఉండగా, రాష్ట్ర అధ్యక్షులుగా ఎవరిని నియమించాలనే అంశం ఇరుపార్టీలకు సవాల్‌గా మారిందంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌లో పీసీసీ, మంత్రి పదవుల మధ్య లింక్‌తో ఎటూ తేల్చుకోలేకపోతుండగా, బీజేపీ మాత్రం సమర్థులైన నేతల కోసం అన్వేషిస్తుండటం వల్లే జాప్యం జరుగుతోందంటున్నారు. అందుకే కాంగ్రెస్ సారథి నియామకంపై లింక్ పెడితే కొన్నాళ్లు సమయం లభిస్తుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారంటున్నారు. ఇలా రెండు పార్టీలు తెలంగాణ సారథులపై తేల్చుకోలేకే వాయిదాలపై వాయిదాలు వేస్తున్నట్లు చెబుతున్నారు.
=============================