ఆ ఇద్దరు ఐపీఎస్ లకు జెత్వానీ చిక్కులు

సిరా న్యూస్,విజయవాడ;
చట్టం ఎవరికీ చుట్టం కాదు.. తగిన సమయంలో అందరికీ సమానంగా వడ్డించేస్తుంది… వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఏపీలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి అటు వైసీపీ నేతలు.. ఇటు పోలీసు, రెవెన్యూ శాఖల్లో ఉన్నతస్థాయి అధికారులకు చిక్కులు ఎక్కువయ్యాయి.ముఖ్యంగా గత ప్రభుత్వంలో కొందరు వైసీపీ నేతల ఒత్తిళ్ల వల్ల…. అవసరానికి మించి ఓవర్‌ చేశారని పలువురు ఐపీఎస్‌లపై ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో కొందరికి పోస్టింగ్‌లు ఇవ్వకుండా ప్రభుత్వం పక్కనబెట్టగా, మరికొందరు వివిధ కేసులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇప్పటికే ఫైళ్ల దహనం, ల్యాండ్‌, శాండ్‌, ఫైబర్‌నెట్‌, లిక్కర్‌ స్కాంల్లో అధికారులపై చర్యలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుండగా, కొందరు ఐపీఎస్‌ అధికారులపైనా ఉచ్చు బిగించేలా తాజాగా అడుగులు పడుతుండటం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది.గత ప్రభుత్వంలో నిబంధనలను పక్కన పెట్టి వైసీపీ చట్టాన్ని అమలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 16 మంది సీనియర్‌ అధికారులకు పోస్టింగ్‌లు లేకుండా ప్రభుత్వం పక్కన పెట్టింది. వీరు రోజూ డీజీపీ ఆఫీసుకు రావాలని మెమో జారీ చేసింది సర్కార్‌. ఈ ఆదేశాలను కొందరు మొక్కుబడిగా పాటిస్తుండగా, మరికొందరు ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దామన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తున్న సమయంలోనే మరో సంచలన విషయం బయటపడింది.వైసీపీ నేతల సూచనల ప్రకారం ముంబైకి చెందిన ఓ సినీ నటిని ఫిబ్రవరిలో అరెస్టు చేసి, ముంబైలో నమోదైన ఓ కేసును సెటిల్‌ చేశారనేది ప్రస్తుతం సంచలనానికి కారణమైంది. ఈ అంశంలో గతంలో విజయవాడలో పోలీసు కమిషనర్‌గా పని చేసిన కాంతిరాణా తాతా, డీసీపీ విశాల్‌ గున్నిపై తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీ నేతల సూచనల ప్రకారం కేసు నమోదు చేయడం, ముంబైలో పారిశ్రామికవేత్తకు మేలు జరిగేలా అక్కడి కేసు ఉపసంహరణ తర్వాత ఇక్కడి కేసును మూసేసినట్లు చెబుతున్నారు. ఆ విషయంలో ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ పాత్రధారిగా ప్రభుత్వానికి ఫిర్యాదు అందగా, సూత్రధారులుగా వైసీపీలోని అగ్ర నేతలపైనే ఆరోపణలు వస్తున్నాయి. ఐతే కేసులో నేరుగా ఇన్‌వాల్వ్ అయిన ఐపీఎస్‌ ఆఫీసర్లు కాంతిరాణా, విశాల్‌ గున్ని చుట్టూ ఉచ్చు బిగిస్తోంది ప్రభుత్వం.తనను తప్పుడు ఫిర్యాదు ఆధారంగా కనీస విచారణ చేయకుండా అరెస్టు చేసిన పోలీసులు.. రిమాండ్‌లో ఉండగా హింసించారని ముంబై నటి కాదంబరి జెత్వాని విజయవాడ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో ఐపీఎస్‌ అధికారులపై విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. ఈ అంశంలో ఆగస్టు ఒకటో తేదీన ముంబైలో అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసిన కాదంబరి జెత్వాని… ఆ తర్వాత విజయవాడ కమిషనర్‌కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు పంపారు. ఇప్పుడు ఈ విషయమై వాంగ్మూలం ఇచ్చేందుకు నేరుగా విజయవాడ వచ్చారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు ఎక్కువయ్యాయి.తనకు సన్నిహితంగా వ్యవహరించిన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను అడ్డుపెట్టుకుని అప్పటి వైసీపీ పెద్దలు ముంబైకి చెందిన ఓ పారిశ్రామికవేత్తపై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకునేలా చేశారని ఆరోపిస్తున్నారు కాదంబరి జెత్వాని. ఇందుకోసం తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించిన తనపై తప్పుడు కేసు బనాయించారని ఆమె అభియోగం. అయితే అప్పట్లో ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో ఆ కేసును సీరియస్‌గా తీసుకుని అప్పటి కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌ గున్ని ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. తెరవెనుక బాగోతం ఒక్కోక్కటిగా వెలుగు చూస్తుండటంతో ప్రభుత్వం వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందననే ఉత్కంఠ పెరిగిపోతోంది.ముంబై నటి కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్‌లు కాంతిరాణా తాతా, విశాల్‌ గున్నిలకు పని లేని శిక్ష విధించింది ప్రభుత్వం. వీరిద్దరూ ప్రతిరోజూ డీజీపీ ఆఫీసుకు వచ్చి సంతకాలు చేయాల్సి వుండగా, ముంబై నటి కేసు వెలుగు చూశాక కాంతిరాణా తాతా డీజీపీ ఆఫీసుకు రాలేదని చెబుతున్నారు. ఇదే సమయంలో విశాఖలో ఉంటున్న విశాల్‌ గున్ని విజయవాడ వచ్చినా డీజీపీ ఆఫీసుకు వెళ్లలేదని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ ఇద్దరిని పక్కన పెట్టిన ప్రభుత్వం… తాజా కేసుతో ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.ఐపీఎస్‌ అధికారులపై ఏ చర్య తీసుకోవాలన్నా ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఉండే జీఏడీకే అధికారం ఉంది. ఈ విషయంలో డీజీపీ కూడా ఏం చేయలేరని అంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఐపీఎస్‌లపై చాలా సీరియస్‌గా ఉంది. కంచె చేను మేసినట్లు చట్టాన్ని పరిరక్షించాల్సిన వారే గీత దాటి వ్యవహరిస్తే కఠిన చర్యలకు గురి కావాల్సివస్తోందని ఇప్పటికే సంకేతాలు పంపింది ప్రభుత్వం. దీంతో ముంబై నటి జెత్వానీ ఫిర్యాదుతో ఐపీఎస్‌లు కాంతిరాణా, విశాల్‌ గున్నిపై వేటు వేసేలా ఫైల్‌ సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఏది ఏమైనా ప్రభుత్వం పక్కన పెట్టిన 16 మందిలో ఇద్దరు ముంబై హీరోయిన్‌ కేసులో బుక్కైపోగా, మరికొందరిపైనా కేసులు పెట్టేందుకు అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి 16 ఐపీఎస్‌ అధికారులు దినదిన గండంగా గడపాల్సి వస్తోందంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *