కిరణ్ కుమార్ రెడ్డికే కమలం పగ్గాలు

సిరా న్యూస్,తిరుపతి;
ఏపీ ప్రభుత్వ భాగస్వామి బీజేపీ… భవిష్యత్‌ రాజకీయాలకు పక్కా స్కెచ్‌ వేస్తోంది. రాష్ట్రంలో బలపడాలని ఆశిస్తున్న కమలనాథులు… కీలకమైన రెడ్డి సామాజికవర్గంపై ఫోకస్‌ చేశారంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో బలమైన ముద్ర వేయాలంటే రెడ్డిల మద్దతు అవసరమని భావిస్తున్న కాషాయదళం… మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని రంగంలోకి దింపాలని చూస్తోందని టాక్‌ వినిపిస్తోంది. రాయలసీమకు చెందిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి.రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల పాటు రాజకీయాలకు కాస్త దూరంగా వ్యవహరిస్తూ వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి… పార్లమెంట్‌ ఎన్నికల ముందు బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు. రాజంపేట నుంచి లోక్‌సభకు పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఒకవేళ ఆయన గెలిస్తే కేంద్ర మంత్రి అయ్యేవారని… కానీ, ఫలితం వేరేలా వచ్చినందున ఆయన సేవలను పార్టీకి వాడుకోవాలని చూస్తున్నారని చెబుతున్నారు.ప్రస్తుతం ఏపీ బీజేపీ చీఫ్‌గా ఉన్న పురందేశ్వరి స్థానంలో కిరణ్‌కుమార్‌రెడ్డికి ఏపీ బీజేపీ చీఫ్‌ బాధ్యతలు అప్పగించాలని కలమనాథులు ప్లాన్‌ చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పురందేశ్వరి పదవీకాలం త్వరలో పూర్తికానుండటం… ప్రస్తుతం ఆమె ఎంపీగా ఉండటం వల్ల ప్రత్యామ్నాయంగా కిరణ్‌కుమార్‌రెడ్డికి అవకాశమివ్వాలని చూస్తున్నారని అంటున్నారు. పైగా కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత సామాజికవర్గాన్ని ఆకట్టుకోవాలని ఇప్పటికే ప్లాన్‌ చేస్తున్న బీజేపీ… కిరణ్‌కు ఇష్టం లేకపోయినా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలనే పట్టుదల ప్రదర్శిస్తున్నట్లు చెబుతున్నారు.ఏపీ రాజకీయాల్లో కులాల ప్రభావం ఎక్కువ. ఒక్కో సామాజికవర్గం ఒక్కో పార్టీతో ర్యాలీ అవుతుంటుంది. కమ్మ సామాజికవర్గం టీడీపీతోను, కాపులు జనసేనతోను, రెడ్డిలు వైసీపీకి మద్దతుగా ఉంటారనే ప్రచారం ఉంది. ఐతే గత ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గం అసంతృప్తితో వైసీపీకి దూరం జరిగిందని విశ్లేషణలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచిన రెడ్డి సామాజికవర్గం… 2024లో దూరం జరగడం వల్ల ఆ సామాజికవర్గం ప్రభావం ఎక్కువగా ఉండే రాయలసీమలో వైసీపీ ఘోరంగా దెబ్బతిన్నదని అంటున్నారు.రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 50కి పైగా నియోజకవర్గాలు ఉండగా, కేవలం ఏడు చోట్లే వైసీపీ గెలిచింది. దీంతో రెడ్డిల్లో అసంతృప్తిని క్యాష్‌ చేసుకోవాలని చూస్తున్న బీజేపీ…. కిరణ్‌కుమార్‌రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించాలని చూస్తోందంటున్నారు. రెడ్డి సామాజికవర్గం బీజేపీతో చేతులు కలిపితే.. భవిష్యత్‌లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగొచ్చని బీజేపీ వ్యూహంగా చెబుతున్నారు.ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే బీజేపీకి రెడ్డి సామాజికవర్గం నాయకత్వం వహించేది. రాష్ట్ర విభజన తర్వాత బీజేపీకి నలుగురు నేతలు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తే అందులో ఇద్దరు కాపు, ఇద్దరు కమ్మ సామాజికవర్గ నేతలు… దీంతో ఈ సారి రెడ్డి సామాజికవర్గం నేతలకు అవకాశం ఇవ్వాలని బీజేపీ అగ్ర నాయకత్వం ఆలోచిస్తోందంటున్నారు. అదేసమయంలో ఇప్పటివరకు అధ్యక్షులుగా పనిచేసిన వారంతా కోస్తా ప్రాంతానికి చెందిన నేతలే… ఈ పరిస్థితుల్లో ఇటు సామాజిక న్యాయం, అటు ప్రాంతీయ సమీకరణలతో రాయలసీమకు చెందిన రెడ్డి నేతను బీజేపీ అధ్యక్షుడిని చేయాలని ప్లాన్‌ చేస్తోందంటున్నారు.ఆ వర్గంలో బలమైన నేతగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి అయితే తమ వ్యూహం ఫలిస్తుందని బీజేపీ పెద్దల ఆలోచనగా చెబుతున్నారు. ఇదే సమయంలో ప్రస్తుత బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సేవలను ఏ విధంగా వాడుకోవాలనే అంశంపైనా బీజేపీ దృష్టిపెట్టిందంటున్నారు. పురందేశ్వరి నాయకత్వంలో టీడీపీతో పొత్తు కుదరడంతోపాటు 8 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాల్లో గెలవడాన్ని చాలా ప్రాధాన్యంగా తీసుకుంది పార్టీ. ఆమెను రాష్ట్ర పార్టీ చీఫ్‌గా తప్పిస్తే మరో కీలక బాధ్యత అప్పగించొచ్చని అంటున్నారు. మొత్తానికి రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలనే ఆలోచనతో బీజేపీ పెద్ద స్కెచ్చే వేస్తోందంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *