ప్లస్ అవుతుందా… మైనస్ అవుతుందా
సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్ మహానగరం, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెరువులను, కుంటలను, నాలాలను, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసింది. దీనికి సీనియర్ ఐపీఎస్ రంగనాథ్‌ను కమిషనర్‌గా నియమించింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మించిన వారి గుండెల్లో హైడ్రా దడ పుట్టిస్తోంది. హైడ్రా వ్యవస్థ ఏర్పాటు నుంచే దూకుడుగా వెళ్తోంది. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. ఇప్పటివరకు అలా.. వందలాది నిర్మాణాలను కూల్చివేయగా.. ప్రభుత్వానికి వెయ్యి ఎకరాలకు పైగా భూమిని రికవరీ చేశారు. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరినీ ఒకే తీరులో చూస్తే అక్రమ కట్టడాలు కనిపిస్తే వాటిని కూల్చుతూ ముందుకు సాగుతోంది.ఇప్పటివరకు ఎలాంటి సిబ్బంది, ఎలాంటి అధికారాలు లేనప్పటికీ హైడ్రా ఓ స్థాయిలో దూసుకుపోయింది. తాజాగా.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హైడ్రాకు మరింత బలాన్ని చేకూర్చింది. నిన్నటి కేబినెట్‌లో హైడ్రాకు అడిషనల్ పవర్స్ ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దాంతో ఇప్పటికే ఎక్కడా తగ్గకుండా దూసుకెళ్తున్న హైడ్రా.. కేబినెట్ నిర్ణయంతో తన దూకుడును మరింత పెంచనుంది. ఇప్పుడు దానికి విస్తృత అధికారాలతో పాటు చట్టబద్ధతను కూడా ఇచ్చారు. చెరువులతోపాటు గ్రేటర్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను తొలగించే వరకూ హైడ్రాకు విశేష అధికారాలు అలానే ఉంటాయని కేబినెట్ స్పష్టం చేసింది. అయితే.. కేబినెట్‌లో మరో నిర్ణయం తీసుకున్నారు. హైడ్రా పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు లోపల 27 అర్బన్, లోకల్ బాడీలకు విస్తరించింది. 51 గ్రామపంచాయతీలను కూడా కోర్ అర్బన్‌లో విలీనం చేస్తూ నిర్ణయం తీసకున్నారు. అలాగే.. ఇప్పటివరకు కేవలం ఒక్క కమిషనర్ రంగనాథ్ మాత్రమే అన్నీతానై ఇదంతా నడిపించారు. కానీ.. తాజాగా ప్రభుత్వం అదనంగా సిబ్బందిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి హైడ్రా ఆపరేషన్స్ కోసం 150 మంది అధికారులతోపాటు 964 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని కేటాయించారు.ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. హైడ్రా ఏర్పాటు నుంచి రేవంత్ రెడ్డి సర్కార్ పలు విమర్శలు, పలు ప్రశంసలు ఎదుర్కొంటోంది. హైడ్రా ఆపరేషన్స్ బాగుందని చాలా వరకు వినిపిస్తుండగా.. మరికొంత మంది నుంచి మాత్రం పేదల కడుపు కొట్టడానికే హైడ్రా తెచ్చారనే విమర్శలు వచ్చాయి. అయితే.. చాలా జిల్లాల నుంచి కూడా హైడ్రాను తమ జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపించింది. అటు పొరుగు రాష్ట్రమైన ఏపీ నేతల నుంచి కూడా హైడ్రా పై ప్రశంసలు వచ్చాయి. అందులోభాగంగానే తాజాగా.. రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకు విశేషాధికారాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే.. ఈ నిర్ణయంతో రేవంత్ రెడ్డి సర్కారుకు ప్లస్ కానుందా..? మైనస్ కానుందా..? అనే చర్చ సైతం జోరుగా నడుస్తోంది. పొలిటికల్ లీడర్లు హైడ్రాను ముందు నుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ సైతం హైడ్రాపై అసంతృప్తితోనే ఉన్నాయి. పర్మిషన్లు తీసుకున్న వారి ఇళ్లను ఎలా కూల్చివేస్తారంటే నిలదీస్తున్నారు. వీటన్నింటి నేపథ్యంలో ముందు ముందు హైడ్రా పనితీరు ఇంకా ఎలా ఉండబోతోంది..? వచ్చిన అధికారాలను ఎలా వినియోగించుకోబోతోందో అని ఆసక్తి నెలకొంది.
ఎవరేమనుకున్నా…
హైదరాబాద్ డిజాస్టర్ అండ్ రెస్పాన్స్ అస్సెట్స్ ఏర్పాటుతో చెరువులు, నాలాలు, కుంటలు ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను ఇప్పటికే అనేకమైన వాటిని కూల్చివేసింది. అయితే ఇంకా వందకు పైగా ఫిర్యాదులు హైడ్రా వద్ద ఉన్నాయి. ముఖ్యమైన భవనాలను నిర్మించి అక్కడ వ్యాపారాలు, విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల ఆసుపత్రులు కూడా నిర్వహిస్తుండటంతో వాటిని కూడా కూల్చాలని రేవంత్ రెడ్డి హైడ్రా అధికారులను ఆదేశించారు. 169 మంది అదనపు సిబ్బందిని హైడ్రాకు కేటాయించడం వెనక కూడా రానున్న కాలంలో హైదరాబాద్ నగరంలో కూల్చివేతలు మరింతగా ఉంటాయాన్న సంకేతాలు పంపినట్లయింది. అసెంబ్లీ సమావేశాల్లో కూడా హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్స్ ను తెచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే అనేక కూల్చివేతలను చేపట్టి యాభై ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్న హైడ్రా రానున్న కాలంలో మరింత స్పీడ్ పెంచే విధంగా అడుగులు వేయనున్నట్లు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. రాజకీయ నేతల ఆక్రమణలను కూల్చివేతలను త్వరలో ప్రారంభిస్తారని తెలిసింది. విద్యాసంస్థలను మాత్రం ఏ ఏడాది వేసవి సెలవుల్లో కూల్చివేతలను చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. మధ్యలో అయితే విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడి విద్యాసంవత్సరం నష్టపోయే అవకాశముందని, తల్లిదండ్రుల నుంచి వ్యతిరేక వస్తుందని భావించి కొంత వెనకడుగు వేసింది. ఈ లోపు న్యాయస్థానంలో వేసిన కేసుల విషయంలోనూ హైడ్రా కొంత సమాచారం ఇచ్చి క్లియర్ చేసుకోవాలని భావిస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉండటంతో కొంత విరామమిచ్చిన హైడ్రా చట్టపరంగా అన్ని క్లియర్ చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్లాలని రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. ఇప్పటికే న్యాయపరమైన చిక్కులు తొలగించేందుకు న్యాయనిపుణులతో హైడ్రా అధికారులు చర్చిస్తున్నారు