సిరా న్యూస్,తాడేపల్లిగూడెం ;
వసతి గృహాల్లో విద్యనభ్యశిస్తున్న విద్యార్థులను హెచ్.డబ్ల్యు.ఓలు తమ సొంత బిడ్డల్లా భావించి సంక్షేమాన్ని అందించాలని జిల్లా జాయింట్ కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు .
బుధవారం తాడేపల్లిగూడెం ప్రభుత్వ బిసి బాలికల వసతి గృహామును జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, పీజీ చదువుకుంటున్న విద్యార్థినిలతో ఆయన మాట్లాడారు. వసతి గృహాలలో వారికి అందుతున్న సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు. వసతి గృహాలలో ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు కలిగిన భయపడకుండా తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఈ సందర్భంగా వంట తయారు చేసే గదులు, పిల్లలు ఉంటున్న గదులును, బాత్రూమ్ లు హాస్టల్ పరిసరాలు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వసతి గృహాలకు నిరుపేదల పిల్లలు చదువుకోవడానికి వస్తారు. వారిని సొంత బిడ్డల్లా భావించి బాగా చదువుకునేలా ప్రోత్సహించాలని వసతి గృహాల అధికారులతో అన్నారు. ప్రభుత్వ వసతి గృహాల నిర్వహణకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. మరుగుదొడ్లు సరిగా లేవని, త్రాగునీటి సౌకర్యాలు లేదని, చదువుకోవడానికి సరైన లైటింగ్ లేదని, తదితర సమస్యలు తన దృష్టికి రాకూడదని అన్నారు. వసతి గృహాల అధికారులు మీ బాధ్యతలను గుర్తించి హాస్టల్ నిర్వహణ పటిష్టంగా చూడాలన్నారు. బాధ్యతలపై నిర్లక్ష్యం వహించే వారిపై శాఖా పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మెనూ ప్రకారం నాణ్యమైన రుచికరమైన శుభ్రత కలిగిన ఆహారం అందించాలని సూచించారు. ప్రస్తుతం 52 మంది విద్యార్థినులు ఉంటున్న భవనము ఇరుకుగా ఉన్నందున అదనంగా వేరే భవనమును అద్దెకి తీసుకోవాలని వసతి గృహం అధికారిని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
ఈ తనిఖీ సందర్భంలో ఇన్చార్జి ఆర్డీవో మరియు కె.ఆర్.ఆర్.సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, తాహసిల్దార్ ఎం సునీల్ కుమార్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జి వి ఆర్ కె ఎస్ ఎస్ గణపతి, సహాయ సంక్షేమ శాఖ అధికారి కె .వెంకటేశ్వరరావు, వసతి గృహం అధికారిణి సిహెచ్ వినీల, తదితరులు ఉన్నారు.