మూసీపై తలో మాట….

సిరా న్యూస్,హైదరాబాద్;
‘‘హైదరాబాద్‌లో 28వేల అక్రమ కట్టడాలు ఉన్నాయి. ఇకపై కొత్త వాటికి ఛాన్స్ లేదు. అన్నింటినీ కూల్చివేయాల్సిందే’’.. సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. నగరానికి వరదలు వచ్చిన సమయంలో, అక్రమ కట్టడాల వల్లే కాలనీలు నీట మునిగిన సందర్భంలో కేసీఆర్ ఈ కామెంట్స్ చేశారు. ట్విస్ట్ ఏంటంటే, కేసీఆర్ వ్యాఖ్యలకు విరుద్ధంగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ వ్యవహరిస్తోంది. తండ్రి ఒక మాట, కుమారుడు మరో బాటలో వెళ్తుండడంతో, కేడర్‌ను కన్‌ఫ్యూజ్‌లోకి నెడుతోంది.
మూసీ ప్రక్షాళనకు సిద్ధమైన ప్రభుత్వం, అక్రమ కట్టడాల కూల్చివేతకు రెడీ అయింది. నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చింది. నదిని సర్వాంగ సుందరంగా తయారు చేసేందుకు ప్లాన్ చేసింది. అయితే, బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫతేనగర్‌లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఎస్‌టీపీని సందర్శించారు. ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు. మూసీ సుందరీకరణను పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల కుంభకోణం జరుగుతోందని, కొత్తగా మూసీని శుద్ధి చేయాల్సిన అవసరం లేదన్నారు. తమ హయాంలో కట్టిన ఎస్‌టీపీలను ఉపయోగించుకుంటే సరిపోతుందని తెలిపారు. హైడ్రా కూల్చివేతలపై కాంగ్రెస్ నేతలకు ఒక న్యాయం, పేదలకు మరొక న్యాయమా అంటూ ప్రశ్నించారు. హైడ్రా బుల్డోజర్లకు తాను అడ్డంగా ఉంటానని స్పష్టం చేశారు.కేటీఆర్ వ్యాఖ్యలు చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో కేసీఆర్ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఆనాడు అధికారంలో ఉండి, అక్రమ కట్టడాలు ఎన్ని ఉన్నాయో తెలిసినా చర్యలు తీసుకోలేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూల్చివేతలు చేస్తుంటే, మూసీ సుందరీకరణను ఆపేస్తా అంటూ మాట్లాడడం ఏంటని మండిపడుతున్నారు. ప్రజలు పక్కకు పెట్టేడయంతో, మళ్లీ జనాన్ని బురిడీ కొట్టిస్తూ పార్టీ మనుగడ కోసమే బీఆర్ఎస్ తంటాలు పడుతోందని అర్థం అవుతోందని కామెంట్స్ పెడుతున్నారు.చెరువులు, నాలాలను ఆక్రమించి కట్టిన వ్యాపార నిర్మాణాలు, కొత్తగా కడుతున్న భవనాలను మాత్రమే హైడ్రా కూల్చివేస్తోంది. అందులో భాగంగా మూసీని సైతం ఆక్రమించిన కట్టడాలపై సీరియస్ యాక్షన్ తీసుకుంటోంది. నాడు అవే అక్రమాలను కూల్చేస్తామని చెప్పిన కేసీఆర్ వ్యాఖ్యలకు విరుద్ధంగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉండటం చర్చనీయాంశంగా మారింది. హైడ్రా తీరును తప్పుబడుతూ అక్రమ కట్టడాలు కూల్చివేస్తే అడ్డుకుంటామని గులాబీ నేతలు చెబుతున్నారు. దీంతో అధినేత ఒకలా పార్టీ నేతలు మరోలా మాట్లాడటం హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *