అక్టోబర్ 3 నుండి 12 వరకు అత్యంత పవిత్రంగా ఘనంగా జరగనున్న నవరాత్రోత్సవాలు
ఇప్పటికే ప్రారంభమైన భవానీ దీక్షలు. భవాని దీక్ష స్వీకరణ కోసం వేలాదిగా తరలివస్తున్న భక్తులు
సిరా న్యూస్,కరీంనగర్;
దసరా నవరాత్రులకు సమయం దగ్గర పడుతుంది. మహిమాన్విత శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లు కొలువుదీరిన దివ్యక్షేత్రం శ్రీ మహాశక్తి దేవాలయంలో శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయంతో పాటు పరిసరాల వీధులన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నయి.
శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతీ స్వాముల ఆశీస్సులతో అక్టోబర్ 3 నుండి ప్రారంభమవుతున్న శ్రీ దేవీ నవరాత్రోత్సవాలు 12 తేదీ వరకు కన్నుల పండుగగా, ఘనంగా, అత్యంత పవిత్రతతో నిర్వహించడానికి ఆలయ నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు శ్రీ మహాశక్తి దేవాలయం కనువిందు చేసేలా దేవాలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పూల అలంకరణలతో, విద్యుత్ దీపాలతో ముస్తాబు చేయిస్తున్నారు. అలాగే ఆలయానికి వచ్చే రహదారులను ఆకర్షణీయమైన విద్యుద్దీపాల వెలుగులతో విరజిమ్మేళ ఏర్పాట్లు చేస్తున్నారు.
కోరిన కోరికలు తీర్చే శ్రీ మహాశక్తి అమ్మవార్లు
శ్రీ మహాశక్తి అమ్మవార్లు నిజంగా చల్లని తల్లులు. ముల్లోకాలకు మూలమైన శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లు కొలువుదీరిన దివ్య క్షేత్రం. ఆ తల్లులను ప్రార్థిస్తే జ్ఞానం, ఐశ్వర్యం, సంతానం, కీర్తి ప్రతిష్టలు, ఇలా ఒకటేమిటి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లులు. నవరాత్రి సమయంలో అమ్మవారిని దర్శిస్తే సర్వ శుభాలను, ఐహిక సుఖాలతో పాటు మోక్షాన్ని పొందవచ్చని శాస్త్ర వచనం. ఈ నవరాత్రి రోజులలో శ్రీ మహాశక్తి దేవాలయం ప్రాంగణం అమ్మవారి నామస్మరణతో మార్మోగుతుంది. ముఖ్యంగా ప్రతి ఏటా అమ్మవారి భక్తులు స్వీకరించే “భవాని దీక్ష” లు ఇప్పటికే ప్రారంభం కాగా వేలాది మంది భక్తులు తమ శక్తి కొలది 108 రోజులు, 41 రోజులు, 21 రోజులు, 11 లేదా నవరాత్రి దీక్షను ప్రతి ఏటా స్వీకరిస్తు నియమనిష్ఠలతో అమ్మవారిని సేవిస్తూ, తరిస్తున్నారు. నవరాత్రోత్సవాలలో భవాని దీక్ష చేపట్టి అమ్మవారిని భక్తితో కొలిస్తే ఎలాంటి బాధనుంచైనా ఉపశమనం లభిస్తుందని సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం భక్తులలో ఉంది. అందుకే దేవాలయ ప్రారంభం నుండి మొదలుకొని నేటి వరకు ఇక్కడ భవాని దీక్ష చేపట్టే భక్తులు గణనీయంగా పెరిగిపోయారు. స్రీ, పురుష బేధములు లేకుండా అందరూ ఆచరించే విశిష్ట భవానీ దీక్ష కోసం కరీంనగర్ జిల్లాతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా, ఇతర రాష్ట్రాల నుండి శ్రీ మహాశక్తి దేవాలయానికి ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవారి మాలాధారణ కోసం, ఉత్సవాల కోసం తరలివచ్చె అశేష భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వహకులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.