హైడ్రాకు సూపర్ పవర్స్

సిరా న్యూస్,హైద్రాబాద్;
హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెడుతూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ప్రత్యేక జోవోను జారీచేసింది. పలు శాఖల అధికారాలను హైడ్రాకు బదిలీ చేయటంతో బాటు హైడ్రా కమిషనర్ తీసుకునే నిర్ణయాలపై న్యాయపరమైన వివాదాలు రాకుండా చూసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు.హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ఆటస్థలాలు సహా ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు, ట్రాఫిక్‌ సమన్వయం, అగ్నిమాపక సేవలు తదితరాలతో కూడిన బాధ్యతలన్నింటినీ హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ(హైడ్రా)కు అప్పగిస్తూ, ఒక ప్రత్యేక సంస్థను తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే హైడ్రా చట్టబద్ధతపై పదేపదే కోర్టులకెక్కటంతో ఈ సమస్యలకు విరుగుడుగా ప్రభుత్వం తగిన క్లారిటీతో ఈ జీవోను జారీ చేసింది.జీహెచ్‌ఎంసీ చట్టం-1955లో గతంలో కేవలం 374, 374-ఎ సెక్షన్లు ఉండేవి. కానీ, తాజాగా సెక్షన్‌ 374-బి చేర్చుతూ ఆర్డినెన్స్‌ ద్వారా ప్రభుత్వం ఆ చట్టాన్ని సవరించింది. దీంతో రోడ్లు, నాలాలు, వీధులు, జలవనరులు, ప్రభుత్వ ఖాళీ స్థలాలు, పార్కులు, ఇతరత్రా ఆస్తుల ఆక్రమణలకు సంబంధించి నోటీసులు ఇవ్వడం, బాధ్యుల నుంచి పత్రాలు కోరడం, ఆక్రమణ నిజమని తేలాక నిర్మాణాలను కూల్చడం, విపత్తులు సంభవించకుండా తగు చర్యలు తీసుకోవడం వంటి అధికారాలన్నీ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ నుంచి నేరుగా హైడ్రాకు బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. దీంతో హైడ్రాకు అదనపు బలం సమకూరినట్లయింది.రాష్ట్ర ప్రభుత్వం జులై 19న జీవో 99 ద్వారా హైడ్రాను ఏర్పాటు చేసింది. దీనికి ఐజీ ర్యాంకు అధికారి ఎ.వి.రంగనాథ్‌ను కమిషనర్‌గా నియమించింది. అప్పట్నుంచి ఆయన ఆధ్వర్యంలో హైడ్రా దూకుడుగా వెళ్తోంది. అనేక అక్రమ కట్టడాలను తొలగించింది. ఈ క్రమంలో.. చట్టపరమైన అవాంతరాల వల్ల కమిషనర్‌ రంగనాథ్‌ ఇతర శాఖలపై ఆధారపడాల్సి వస్తోంది. ఆక్రమణలను తొలగించేందుకు.. జీహెచ్‌ఎంసీ, శివారు మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల ద్వారా నోటీసులు ఇప్పిస్తూ, అనుమతులు రద్దు చేయిస్తూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు 374-బి సెక్షన్‌లోని అధికారాలను హైడ్రాకు బదిలీ చేయటంతో.. జీహెచ్‌ఎంసీ పరిధిలో హైడ్రా కమిషనర్‌కు నేరుగా చర్యలు తీసుకునే వెసులుబాటు ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *