సిరా న్యూస్,విజయవాడ;
వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పార్టీ ప్రక్షాళనలో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వరుసగా నేతలతో సమావేశం అవుతున్న ఆయన మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో అధ్యక్షులను మార్చిన జగన్ ఇప్పుడు కోఆర్టినేటర్లను మార్చారు. సీనియర్లకు ఆ బాధ్యతలు అప్పగించారు. విజయసాయి రెడ్డికి మళ్లీ ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించారు. పార్టీ కీలక నేతలతో జగన్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ భేటీకి పార్టీ జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు హాజరయ్యారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో సాగిందీ సమావేశం. బూత్ లెవల్లో పార్టీ ప్రక్షాళనకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కేడర్‌ను మళ్లీ ఉత్సంగా కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసేందుకు ప్రణాళిక రచించారు. ఇప్పటికే మంగళగిరి, రేపల్లె నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించి కొత్త ఇన్ఛార్జ్లను జగన్ నియమించారు. ఇకపై మిగతా నియోజకవర్గాలపై ఫోకస్ చేయాలని పార్టీ నేతలు కోరారు. దీనికి సంబంధించిన ప్రణాళికను కూడా విడుదల చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలను సెంట్రిక్‌గా చేసుకొని కోఆర్డినేటర్లను జగన్ నియమించారు. కొందరు సీనియర్ లీడర్‌కు రెండు జిల్లాలు మరికొందరికి మూడు జిల్లాల బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలకు ఎంపీ మిథున్ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాల బాధ్యతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. ఆళ్ళ అయోధ్య రామిరెడ్డికి మాత్రమే ఒక్క ఉమ్మడి కృష్ణా జిల్లా కోఆర్డినేషన్ ఇచ్చారు. ఉమ్మడి ఈస్ట్, వెస్ట్ గోదావరిని బొత్స సత్యనారాయణకు, ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం జిల్లా బాధ్యతలు విజయసాయిరెడ్డికి, కడప, అనంతపురం, కర్నూలును వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. ఇప్పటి వరకు వైసీపీ నుంచి బయటకు వెళ్లే వాళ్లనే చూశాం. ఇన్ని నెలల తర్వాత తొలిసారి అధికార పార్టీ నుంచి ఓ నేత వైసీపీలో చేరారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణ వైసీపీలో చేరారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిసహా అన్ని పదవులకు రాజీనామా చేసి జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. జగన్ మోహన్ రెడ్డి మురళీకృష్ణకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత కేడర్‌లో ఒక్కసారిగా నిస్తేజం ఏర్పడింది. అప్పడప్పుడు జగన్ బయటకు వస్తున్నప్పటికీ మునుపటి జోష్ కనిపించడం లేదు. మరోవైపు కేసుల్లో ఇరుకున్న వాళ్లు జైలుపాలు అవుతున్నారు. ఇది కూడా పార్టీలో ఓ విధమైన నిరాశకు కారణం అవుతుంది. అందుకే ఇప్పటి వరకు జిల్లా పార్టీని ప్రక్షాళన చేసిన జగన్… ఇప్పుడు నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకు బాధ్యతలు అప్పగించిన నేతలందా ప్రజల్లో ఉండాలని జగన్ సూచించారు. వారి పని తీరుపై ఎప్పటికప్పుడు రిపోర్టులు తీసుకుంటామని అన్నారు. వాటి ఆధారంగానే ఆ నేతల భవిష్యత్ ఆధార పడి ఉంటుందని చెప్పుకొచ్చారు.