సిరా న్యూస్,మంథని;
ఐక్యరాజ్య సమితిలో భారత దేశం శాశ్వత సభ్యత్వం పొందడం భారతీయులందరు గర్వించదగ్గ విషయమని బీజేపీ నాయకులు సత్యప్రకాశ్, సబ్బని సంతోష్‌లు అన్నారు. మంథనిలోని ప్రెస్ క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 65 ఏళ్లు అధికారంలో ఉన్నా ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కోసం ఏనాడు ఆలోచన చేయలేదన్నారు. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం రాక పోవడానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తన బలమైన ధోరణి వినిపించక పోవడమేనన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ కేవలం 10 సంవత్సరాల కాలంలో ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్యత్వాన్ని భారతదేశానికి దక్కించిందన్నారు. ఇందుకు ప్రధాని మోదీ పాలన, ధౌత్యమే కారణమన్నారు. ప్రపంచ దేశాలను ధౌత్య సంబంధాలతో ఒప్పించి మెప్పించి శాశ్వత సభ్యత్వాన్ని తీసుకువచ్చిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదన్నారు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు బాగుండాలని, సుఖః సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించేది భారతదేశమని యావత్ ప్రపంచమే గ్రహించిందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు రానున్న రోజుల్లో యుద్ధాలు రాకుండా సైతం మోదీ చర్యలు తీసుకుంటారన్నారు. బీజేపీ పాలనతో దేశం రానున్న రోజుల్లో సూపర్ పవర్ దేశంగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బోగోజు శ్రీనివాస్, రాపర్తి సంతోష్, చిలువేరి సతీష్, రమేష్, లక్ష్మణ్, శంకర్, అశోక్‌లు పాల్గొన్నారు.