సిరా న్యూస్,వరంగల్;
ఉమ్మడి వరంగల్ జిల్లా పోలీసులు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారారు. ఏకంగా పోలీస్ ఇన్స్‌పెక్టర్ పైనే పొక్సో కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. ఇప్పుడే కాదు.. గతంలోనూ జిల్లాలో పనిచేసిన కొందరు అధికారులపై ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది చేసే తప్పుడు పనుల కారణంగా.. మొత్తం డిపార్ట్‌మెంట్‌కు చెడ్డపేరు వస్తోందని పోలీసులే చర్చించుకుంటున్నారు. కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే 5 ఘటనలు జరిగాయి.
1.వరంగల్ నగరంలోని ఓ అపార్ట్ మెంట్లో నివసిస్తున్న పోలీస్ ఇన్స్పెక్టర్ రవికుమార్.. అదే ప్రాంతంలో ఉంటున్న ఓ బాలికపై కన్నేశాడు. అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. గమనించిన బాలిక.. తప్పించుకుని తల్లికి విషయం చెప్పింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కాజీపేట పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు
2.కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో పనిచేసిన ఎస్సై అనిల్.. మరో ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగిని వేధించాడు. ఆ ఉద్యోగిని భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
3.జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లాలో పనిచేస్తున్న సీఐ సంపత్.. కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె కూతురుపైనా అత్యాచారం చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు.
4.గతేడాది పోలీసు కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న ఓ ఇన్‌స్పెక్టర్, మహిళ ఎస్సైతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భర్త ఫిర్యాదుతో విచారణ చేసిన అధికారులు.. ఇన్‌స్పెక్టర్, ఎస్సై ఇద్దరిని సస్పెండ్ చేశారు.
5.పోలీసు శాఖలోని వేరే విభాగంలో పనిచేస్తున్న ఓ సీఐ.. చింతగట్టు సమీపంలో గెస్ట్ హౌజ్‌లో మహిళతో ఉన్నట్లు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లేసరికి మహిళను తప్పించాడు. పోలీసులు దీనిపై విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు.
ఇలా పోలీసు శాఖలోనే వరుస ఘటనలు వెలుగు చూస్తుండడంతో.. సామాన్యులు పోలీస్ స్టేషన్‌లకు వచ్చి ఫిర్యాదులు చేసేందుకు భయపడుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితిని చక్కదిద్దాలని కోరుతున్నారు. ఇటు తాజా ఘటనను పోలీస్ శాఖ సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. కఠిన చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉందని ఏసీపీ స్థాయి అధికారి చెప్పారు.