సిరా న్యూస్,సిద్దిపేట;
తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీఎస్ జెయు) సిద్దిపేట జిల్లా కమిటీ సమావేశం సోమవారం శివాన్ భవ ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ సమావేశానికి యూనియన్ నాయకులు బాపిరెడ్డి అధ్యక్షత వహించారు. సమావేశానికి నేషనల్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఇండియా) జాతీయ ఉపాధ్యక్షులు ఎన్. పురుషోత్తం, టీఎస్ జెయు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మెరుగు చంద్రమోహన్, తోకల అనిల్ కుమార్, కోశాధికారి పాపాని నాగరాజు ముఖ్యఅతిధులు హాజరయ్యారు. సందర్భంగా పురుషోత్తం మాట్లాడుతూ జిల్లాలో జర్నలిస్టులందరికి ఇల్లు లేదా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే జర్నలిస్టుల నుంచి ఇండ్ల స్థలాల కోసం దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. మన కోసం మనం, జనం కోసం మనంగా జర్నలిస్ట్ లు పని చేయాలని పురుషోత్తం అన్నారు. ఈ సందర్భంగా జిల్లా నూతన అధ్యక్షునిగా చింతలపల్లి బాపిరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరో పది రోజులలో పూర్తి స్థాయి జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకుంటామని వారు ప్రకటించారు. ఈ సందర్భంగా బాపిరెడ్డి మాట్లాడుతూ తనను జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకున్న సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా జాతీయ, రాష్ట్ర నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు. ఈ సమావేశంలో టీఎస్ జెయు జిల్లా నాయకులు కొత్తపల్లి రాజేందర్, గుడి భాను ప్రకాష్, బడుగు భాస్కర్, గుడిసె ప్రభు, బచ్చని శంకర్ తదితరులు పాల్గొన్నారు.