సిరా న్యూస్,మెదక్;
మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం.. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. బగారెడ్డి , గీతారెడ్డిలాంటి హేమాహేమీలు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను తిరుగులేని శక్తిగా నిలిపారు. బాగారెడ్డి మరణం తర్వాత.. గీతారెడ్డితో పాటు దివంగత ఫరీదుద్దీన్.. నియోజకవర్గంపై పార్టీ పట్టు సడలకుండా కాపాడారు. 2018లో గీతారెడ్డి ఓటమితో కాంగ్రెస్ ప్రాబల్యం తగ్గిపోతూ వస్తోంది.వరుసగా రెండుసార్లు బీఆర్ఎస్ విజయం సాధించింది. 2023 ఎన్నికల్లో గీతారెడ్డి పోటీకి దూరంగా ఉన్నారు. దీంతో మాజీ మంత్రి చంద్రశేఖర్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. 12వేలకు పైగా ఓట్ల తేడాతో.. బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్ రావు చేతిలో ఓడిపోయారు. గీతారెడ్డి దూరంగా ఉండడం.. చంద్రశేఖర్‌కు నియోజకవర్గ పార్టీ శ్రేణులపై పట్టు లేకపోవడంతో.. జహీరాబాద్‌లో కాంగ్రెస్‌కు కొత్త నాయకుడి అవసరం ఏర్పడిందనే టాక్ నడుస్తోంది. 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత.. గీతారెడ్డి నియోజవర్గానికి రావడమే తగ్గించారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో 2023 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు.జహీరాబాద్ ఎంపీపీగా ఉన్న గిరిధర్ రెడ్డి.. పార్టీని నడిపిస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో చంద్రశేఖర్‌కు గిరిధర్ రెడ్డి వర్గం గట్టిగానే సపోర్ట్ చేసినా.. గీతారెడ్డి వర్గం నుంచి మాత్రం ఎలాంటి సహకారం అందలేదని తెలుస్తోంది. చంద్రశేఖర్ కోసం గీతారెడ్డి కనీసం ప్రచారం కూడా చేయలేకపోయారు. దీంతో గెలవాల్సిన సీటు కాస్త బిఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లిపోయిందనే చర్చ నడుస్తోంది.ఇక అసెంబ్లీ ఎన్నికల తర్వాత గీతారెడ్డి జహీరాబాద్‌కు వచ్చిందే లేదు. దీంతో ఆమె జహీరాబాద్‌కు దాదాపు దూరం అయినట్లే అనే చర్చ జరుగుతోంది. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా.. చంద్రశేఖర్‌కు ఏ పదవి దక్కలేదు. గిరిధర్ రెడ్డికి మాత్రం సెట్విన్ చైర్మన్ పదవి ఇచ్చారు. ఇప్పుడు జహీరాబాద్ నుంచి స్ట్రాంగ్ లీడర్ కావాలని హస్తం పార్టీ భావిస్తోంది. దీనికోసం రకరకాల ఆప్షన్లు సెర్చ్ చేస్తోంది.బీఆర్ఎస్ నుంచి గెలిచిన మాణిక్‌రావును కాంగ్రెస్‌లో చేర్చుకొని.. పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని హైకమాండ్ ఆలోచిస్తోంది. మాణిక్ రావు కూడా పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వరుసగా రెండుసార్లు గెలిచిన మాణిక్ రావును పార్టీలో చేర్చుకోవడంపై.. గిరిధర్ రెడ్డి వ్యతిరేకతేమీ చెప్పడం లేదు. ఐతే చంద్రశేఖర్‌ను పార్టీలోకి తీసుకుంటే.. తన భవిష్యత్‌పై దెబ్బపడుతుందని.. చంద్రశేఖర్ బెంగలో ఉన్నట్లు సమాచారంఇక అటు జహీరాబాద్‌కు దూరంగా ఉంటున్న గీతారెడ్డి.. గాంధీ భవన్‌తో మాత్రం టచ్‌లో ఉన్నారు. మాణిక్‌రావును పార్టీలోకి ఆహ్వానించడంలో.. గీతారెడ్డిని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు.. జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ అభిప్రాయం తీసుకుంటారు. ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇస్తే.. మాణిక్‌రావు రూట్ క్లియర్. ఐతే అదే జరిగితే.. చంద్రశేఖర్‌కు గడ్డపరిస్తితులు తప్పవు. సొంత నియోజకవర్గాన్ని వీడి జహీరాబాద్‌కు వచ్చిన చంద్రశేఖర్‌కు రాజకీయంగా సంకట పరిస్థితి ఎదురయ్యే చాన్స్ ఉంది. దీంతో జహీరాబాద్ రాజకీయంలో ఏం జరగబోతుందనే ఆసక్తి ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది.